సలార్ రిలీజ్ డేట్ మారుతుందా..?

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. గతంలోనే సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. ఇంత పెద్ద సినిమాకు ఆ మేరకు ప్రమోషన్స్ కానీ హడావిడీ కానీ కనిపించడం లేదు. కనీసం ఒక అప్డేట్ కూడా రావడం లేదు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరుగుతోంది.. ఎందుకు సలార్ అప్డేట్స్ ఇవ్వడం లేదు అంటూ నిర్మాణ సంస్థతో పాటు దర్శకుడిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో వేక్ అప్ టీమ్ సలార్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేస్తున్నారు.

అయినా మూవీ టీమ్ నుంచి సరైన రెస్పాన్స్ రావడం లేదు. దీంతో అసలేం జరుగుతుందా ఆరాలు తీస్తే.. ఈ సినిమా అనుకున్నంతగా అవుట్ పుట్ రాలేదు అని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో రిలీజ్ చేయాలనుకున్న సినిమా అంతా ఎడిటింగ్ చూశాక కొన్ని లూప్ హోల్స్ కనిపించాయట.

ముందు వాటిని సరి చేస్తే కానీ ట్రైలర్ కట్ చేయలేరు. అందుకే మూవీ మెయిన్ టీమ్ మొత్తం 24గంటలూ రిలీజ్ డేట్ అనే డెడ్ లైన్ ను చేరేందుకు కష్టపడుతున్నారట. అందువల్ల ఈ నెలలో పాటలు కానీ, ట్రైలర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయలేమనుకున్నారు. అలాగే అభిమానుల డిమాండ్స్ కు తలొంచితే మరికొన్ని ఇబ్బందులు తప్పువు.

హడావిడీలోనో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారనో ఏదో ఒకటి విడుదల చేస్తే.. అందులో ఏవైనా సమస్యలుంటే బిజినెస్ ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎవరెన్ని అనుకున్నా.. ప్రశాంత్ అండ్ టీమ్ మాత్రం కామ్ గా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ తో అవుట్ పుట్ కోసం ప్రయత్నిస్తున్నారు.


ఇక ఇప్పటికి వినిపిస్తున్న దాన్ని బట్టి సెప్టెంబర్ 7 లోగా ట్రైలర్ విడుదల చేస్తారట. ఆ తర్వాత ప్రమోషన్స్ ను ప్లాన్ చేసుకుంటారని సమాచారం. ఈ ప్రమోషన్స్ వ్యవహారాన్ని కూడా ఓ ఏజెన్సీకి ఇవ్వబోతున్నారు. ఈ మేరకు ప్రభాస్ కూడా వాళ్లు చెప్పినట్టే చేయాల్సి ఉంటుంది. ఇది అతనికి ఇష్టం లేకపోయినా.. టైమ్ తక్కువగా ఉంది కాబట్టి మూవీ టీమ్ తో ‘మీ ఇష్టం’ అన్నాడని టాక్.

మొత్తంగా సలార్ విషయంలో ఒక ఆందోళన ఉన్నమాట వాస్తవం. రిలీజ్ డేట్ లో మార్పులు ఉండకపోవచ్చు కానీ.. అనుకున్నంత నింపాదిగా విడుదల చేయలేరేమో అనిపిస్తోంది. ఆఖరి నిమిషం వరకూ కష్టపడితే కానీ ఆ డేట్ కు రాలేరు అనేది బలంగా వినిపిస్తోన్న మాట. ఇలాంటి సమయాల్లో ఇలాంటి మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే ఒక అథెంటిక్ పర్సన్ నుంచి సరైన న్యూస్ ఇస్తే చాలా వరకూ బెటర్ అవుతుంది.

Related Posts