సంక్రాంతి సినిమాల ఫైనల్ రిజల్ట్ ఏంటి?

సంక్రాంతి సందడి దాదాపు ముగిసింది. ఇక.. కలెక్షన్ల లెక్కలు తేలాల్సిన సమయం ఆసన్నమైంది. ఈసారి సంక్రాంతి సమరం సమ్ థింగ్ స్పెషల్ గా నిలిచిందని చెప్పొచ్చు. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రాలతో పాటు ఈ సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా విడుదలైంది ‘హనుమాన్’. అయితే.. పెద్ద సినిమాలకంటే మిన్నగా ‘హనుమాన్’ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించి.. పాన్ ఇండియా లెవెల్ లో ఇంకా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది ‘హనుమాన్’. పెట్టిన పెట్టుబడికి కొన్ని రెట్లు లాభాలు తీసుకొచ్చిన బ్లాక్ బస్టర్ మూవీగా ‘హనుమాన్’ నిలవబోతుంది.

ఇంకా.. సంక్రాంతి చిత్రాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నట్టు ట్రేడ్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. ఈ సినిమా దాదాపు అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించిందట. తొలుత నెగటివ్ టాక్ వచ్చినా.. మౌత్ టాక్ తో ఈ సినిమా బాగా పికప్ అయ్యింది. ప్రీమియర్స్, ఓపెనింగ్స్ రూపంలో ‘గుంటూరు కారం’కు భారీ కలెక్షన్లు దక్కడం.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడానికి కారణాలుగా చెప్తున్నారు.

కింగ్ నాగార్జున మరోసారి సంక్రాంతి బరిలో కింగ్ గా నిలిచాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘నా సామిరంగ’ అన్ని ఏరియాలలోనూ బ్రేక్ ఈవెన్ సాధించినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అచ్చమైన సంక్రాంతి సందడితో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువే. అందుకే.. ఫస్ట్ వీక్ లోనే ఆ టార్గెట్ ను సునాయాసంగా చేరుకుంది ‘నా సామిరంగ’.

ఫైనల్ గా సంక్రాంతి బరిలో టార్గెట్ ను మిస్సైన మూవీ ‘సైంధవ్’. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్ఠాత్మక 75వ సినిమాగా ‘సైంధవ్’ రూపొందింది. చైల్డ్ సెంటిమెంట్ తో కూడిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కి ఆడియన్స్ అంతలా కనెక్ట్ కాలేదు. దీంతో సంక్రాంతి బరిలో ‘సైంధవ్’ డిజాస్టర్ గా మిగిలింది.