టాలీవుడ్ లో టగ్ ఆఫ్ వార్.. సి కళ్యాణ్‌ వర్సెస్ దిల్ రాజు..?

రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్నికల వేడి మొదలు కాబోతోంది. ఆ మాటకొస్తే ఆల్రెడీ మొదలైంది కూడా. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ హీట్ కంటే ముందే తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నికల సందడి స్టార్ట్ అయింది. సినిమా వారి ఎన్నికలు అంటే ఒకప్పుడు కామ్ గా అయిపోయేవి. ఈ మధ్య కాలంలో వీళ్లు కూడా సార్వత్రిక ఎన్నికల రేంజ్ లో హడావిడీ చేస్తున్నారు.

హామీలు ఇస్తున్నారు. క్యాంప్ లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు రకరకాల రాజకీయాలు చేస్తున్నారు. అందుకే తెలుగు సినిమా పరిశ్రమలో ఏ ఎన్నికలు జరిగినా జనం దృష్టి కూడా ఆ వైపు వెళుతోంది. ఇక ఇండస్ట్రీకి మొదటి అక్షరం నిర్మాత. వారి మధ్యే త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి.


తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలెక్షన్స్ కు నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పటి నుంచో చాంబర్ పై అనధికారికంగానే అధికారం చెలాయించే వారు ఇప్పుడు బరిలో దిగి పోటీకి సిద్ధపడుతున్నారు. అయితే ప్రధానంగా పోటీ మాత్రం దిల్ రాజు, సి కళ్యాణ్‌ మధ్యే కనిపిస్తోంది.


తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి పోటీ పడేవారు నామినేషన్స్ వేయానికి జూలై 14 కి ఆఖరు తేదీ. ఆ లోగా ఔత్సాహికులంతా నామినేషన్స్ ను దాఖలు చేయాలి. ఇక మధ్యలో జరిగే బుజ్జగింపుల పర్వానికి తలొంచి, లేదా తమ బలం ముందే తెలుసుకున్నవాళ్లంతా జూలై 21 తేదీ లోపు తమ నామినేషన్స్ ను ఉపసంహరించుకోవచ్చు. ఇక జూలై 30న ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు జరుతాయి. అదే రోజు సాయంత్రానికి ఫలితాలు కూడా వస్తాయి.


అయితే ఈ సారి పోటీ ప్రధానంగా దిల్ రాజు, సి కళ్యాణ్‌ మధ్య కనిపిస్తోంది. ఇద్దరూ ఎవరికి వారు ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధం అవుతున్నారు. కొన్నాళ్లుగా నిర్మాతల మండలిలో వస్తోన్న మార్పులు, కనిపిస్తోన్న ఆధిపత్యాలు చూస్తోంటే ఈ సారి ఎన్నికలు మరింత వాడి వేడిగా జరగబోతున్నాయనేది మాత్రం అర్థం అవుతుంది. మరి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది చూడాలి.