కేరళ స్టోరీ అత్యాశ.. అసలుకే ముంచిందా..?

ది కేరళ స్టోరీ .. కొన్నాళ్ల క్రితం దేశవ్యాప్తంగా పాపులర్అయిన సినిమా. కశ్మీర్ లో ముగ్గురు అమ్మాయిలను బలవంతంగా లవ్ జీహాదీలుగా మార్చారనే కంటెంట్ తో వచ్చిన ఈమూవీ ఆ తరహాలో 32వేల మంది అమ్మాయిల్ని మార్చారు అనే అసత్యాలను కూడా ప్రచారం చేసింది. ఏమైతేనేం.. ప్రస్తుత కంట్రీ మూడ్ కు తగ్గట్టుగా ఈ మూవీ కూడా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది

. ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ ను కూడా ఆశ్చర్యపరిచింది. సుదీప్తో సేన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని విపుల్ అమృత్ లాల్ షా నిర్మించాడు. తెలుగులో ఎప్పుడో రిజెక్ట్ అయిన అదాశర్మతో పాటు మరికొందరు చిన్న ఆర్టిస్టులు నటించిన ఈ మూవీ ఆ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం అంటే ఖచ్చితంగా దీనికి వెనక ఎవరున్నారు అనేది అందరికీ తెలుసు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని నిషేధించారు కూడా. అయినా అన్నిటినీ దాటుకుని అద్భుతంగా పర్ఫార్మ్ చేసిన ఈ మూవీకి ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది.


అంత పెద్ద హిట్ అయిన సినిమాను థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లూ ఉంటారు కదా. వాళ్లంతా ఓటిటిలో చూడాలనుకుంటారు. బట్ ఈ చిత్రాన్ని ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ తీసుకోవడం లేదు. అందుకు కారణం నిర్మాతల అత్యాశే అంటున్నారు. ఎలా చూసినా ఇది ఓ సాధారణ చిత్రమే. అలాంటి సినిమాకు ఏకంగా 50 కోట్లకు పైగా రైట్స్ గా అడుగుతున్నారట మేకర్స్.

ఈ తరహా మూవీస్ ఒన్ టైమ్ వాచ్ మాత్రమే. అలాంటి సినిమాలకు అంత రేట్ పెట్టడానికి ఎవరు మాత్రం ముందుకు వస్తారు. అందుకే ది కేరళ స్టోరీని ఇప్పటి వరకూ ఎవరూ కొనలేదు. అయితే ఈ చిత్ర దర్శకుడి వెర్షన్ వేరే ఉంది. సినిమా ఇండస్ట్రీలన్నీ కలిసి తమ సినిమా ఓటిటిలోకి రాకుండా మమ్మల్ని శిక్షిస్తున్నాయని ఆరోపిస్తున్నాడు. మరి ఈ ఆరోపణలో ఎంత నిజాయితీ ఉందో మీరే ఆలోచించండి.