ఈ వారం థియేటర్లలో రావాల్సిన ‘ప్రతినిధి 2’ వాయిదా పడడంతో.. విశాల్ ‘రత్నం’కి పోటీ లేకుండా పోయింది. బాక్సాఫీస్ వద్ద ‘రత్నం’ సింగిల్ గా థియేటర్లలోకి దిగుతోంది. మరోవైపు.. ఓటీటీ లలో మాత్రం సినిమాల సందడి జోరుగా ఉంది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 25, 26 లలో కొన్ని క్రేజీ తెలుగు మూవీస్ ఓటీటీ లలో సందడి చేస్తున్నాయి.
గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘భీమా’ ఈరోజు (ఏప్రిల్ 25) నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ వేదికగా ‘భీమా’ స్ట్రీమ్ అవుతోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గోపీచంద్ కి జోడీగా ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ నటించారు. పవర్ ఫుల్ పోలీస్ స్టోరీతో తెరకెక్కిన ‘భీమా’ సినిమా మార్చి 8న థియేటర్స్ లోకి వచ్చింది. మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ‘భీమా’. ముఖ్యంగా బి, సి సెంటర్స్ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు.\
ఈ సమ్మర్ సీజన్ లో ఇప్పటివరకూ విడుదలైన చిత్రాలలో అతిపెద్ద విజయాన్ని సాధించింది ‘టిల్లు స్క్వేర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్ గా రూపొందిన చిత్రమిది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 26 నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ‘టిల్లు స్క్వేర్‘ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.
విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ రూపొందింది. దిల్ రాజు నిర్మాణంలో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. అయితే.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తోందా? అని వెయిట్ చేస్తున్న విజయ్ ఫ్యాన్స్ కి అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ అందించింది. ఏప్రిల్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.