ఆరంభం అదిరింది.. ఆ తర్వాతే మొదలైంది..

ఈ ఏడాది ఆరంభంలో మెగా ఫ్యామిలు హీరోలు అదరగొట్టారు. జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య‘ ఘన విజయాన్ని సాధించింది. రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150‘ తర్వాత చిరంజీవికి దక్కిన అసలుసిసలు సూపర్ హిట్ ఇది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వాల్తేరు వీరయ్య గా మెగా పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు చిరు. ఇక.. ఏప్రిల్ లో విడుదలైన సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష‘ కూడా ఘన విజయాన్ని సాధించింది. హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ కు సరికొత్త విజువల్ ట్రీట్ అందించింది. సుకుమార్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో కార్తీక్ వర్మ దండు తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్లు వసూళ్లను కొల్లగొట్టింది. అలా.. ఈ ఏడాది ప్రథమార్థంలో ‘వాల్తేరు వీరయ్య, విరూపాక్ష‘లతో ఘన విజయాలందుకున్నారు మెగా హీరోలు.

ద్వితియార్థంలో మాత్రం ఒకటి తర్వాత ఒకటిగా.. మెగా ఫ్యామిలీకి షాకులు తప్పలేదు. జూలైలో ఎన్నో అంచనాలతో వచ్చిన పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్ ‘బ్రో‘ అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. అయితే.. లాంగ్ రన్ లో ఈ మూవీ ఏవరేజ్ గా నిలిచింది. ఇక.. ఆగస్టులో ఎన్నో అంచనాలతో వచ్చిన చిరంజీవి ‘భోళా శంకర్‘ తీవ్రంగా నిరాశపరిచింది. చిరు సినిమాల్లోనే ఒన్ ఆఫ్ ది డిజాస్టర్స్ గా మిగిలింది ఈ చిత్రం. ఆగస్టు నెలలోనే విడుదలైన వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున‘ది అదే పరిస్థితి. ‘ఎఫ్ 3‘ వంటి హిట్ తో వున్న వరుణ్ తేజ్ కి ఈ మూవీ పెద్ద ఫ్లాప్ అందించింది. లేటెస్ట్ గా రిలీజైన మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ‘కి నెగటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇక.. ఈ ఏడాది డిసెంబర్ లో వస్తే వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వేలంటైన్‘ రావాల్సి ఉంది. డిసెంబర్ 8న విడుదల తేదీ ఖరారు చేసుకున్న ‘ఆపరేషన్ వేలంటైన్‘ ప్రమోషన్స్ అయితే ఇంకా షురూ కాలేదు. మొత్తంమీద.. ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ హీరోలు ఆరంభంలో అదరగొడితే.. ఆ తర్వాత పూర్తిగా నిరాశపరిచారని చెప్పొచ్చు.

Related Posts