కోలీవుడ్ లో దూసుకుపోతోన్న సునిల్

కమెడియన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యి.. టాప్ కమెడియన్ గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నాడు సునిల్. సినిమాలు పోయినా.. అతని కామెడీ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. తర్వాత హీరోగా మారాడు. ఆ మురిపెం కూడా అయిన తర్వాత విలన్ గానూ మెప్పించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణిస్తున్నాడు. అయితే కొన్నాళ్లుగా కోలీవుడ్ సునిల్ వెంట పడుతుండటం విశేషం. నిజానికి పుష్ప లో అతన్నీ అతని గెటప్ ను చూసిన తెలుగు ప్రేక్షకులు ఇతనేనా అప్పట్లో మనకు అంత కామెడీ పంచిన నటుడు అని ఆశ్చర్యపోయారు. అంటే ఏ పాత్రలో అయినా మెప్పిస్తున్నాడు అని అర్థం కదా.


ఆ మధ్య ఒకటీ అరా తమిళ్ సినిమాల్లో కనిపించినా.. ఈ మధ్య సునిల్ కు కోలీవుడ్ నుంచి టాప్ ఆఫర్స్ వస్తున్నాయి. లేటెస్ట్ గా జైలర్ లో చేసిన పాత్ర బాగా పేలింది. అది తమిళీయన్స్ కు బాగా కనెక్ట్ అయింది కూడా. దానికి ముందు మహా వీరుడులోనూ అతని పాత్ర హైలెట్ అయింది. అందుకే వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో పాటే ఆల్రెడీ కొన్ని కోలీవుడ్ సినిమాలకు సైన్ చేసి ఉన్నాడు సునిల్. వాటిలో విశాల్ హీరోగా రూపొందుతున్న మార్క్ ఆంటోనీతో పాటు కార్తీ నటించిన జపాన్ సినిమాలున్నాయి. ఈ రెండూ రాబోయే రెండు మూడు నెలల్లో విడుదలవుతాయి.

అలాగే లారెన్స్ తమ్ముడు ఎల్విస్ హీరోగా రూపొందుతోన్న ఓ సినిమాలో సునిల్ కు అత్యంత కీలకమైన పాత్ర ఇచ్చారట. ఈ పాత్రను అతనే చేయాలని స్వయంగా లారెన్స్ రికమెండ్ చేయడం విశేషం. మొత్తంగా ఇవన్నీ క్రేజీ ప్రాజెక్ట్ లే. అంటే ఒక దశదాటిన తర్వాత వేరే భాషల నుంచి ఆఫర్స్ వస్తే ఎలాంటి పాత్రైనా చేస్తారు కొందరు. కానీ సునిల్ అలా కాదు.. తనకు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలే వస్తున్నాయి. తనూ అలాంటివే ఎంచుకుంటున్నాడు. చూస్తోంటే రాబోయే రోజుల్లో తెలుగు జనాలకు కూడా దొరకనంతగా అక్కడ బిజీ అయ్యేలా ఉన్నాడంటున్నారు.

Related Posts