‘ప్రేమలు’తో హిట్ కొట్టిన రాజమౌళి కొడుకు

దర్శకధీరుడు రాజమౌళి విజయం వెనుక అతని కుటుంబం బలం ఎంతో పెద్దది. తండ్రి విజయేంద్రప్రసాద్ కథలు, అన్నయ్య కీరవాణి సంగీతం, భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్స్.. వంటివి జక్కన్న సినిమాలకు పెద్ద అస్సెట్స్ అని చెప్పాలి. ఇంకా.. రాజమౌళి చిత్రాలకు ఎక్కువగా కష్టపడే మరొక వ్యక్తి అతని తనయుడు కార్తికేయ. సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా, ప్రొడక్షన్ మేనేజర్ గా.. రాజమౌళి చిత్రాలకు సరికొత్త పబ్లిసిటీ నిర్వహించే వ్యక్తిగా.. కార్తికేయకి మంచి పేరుంది.

రాజమౌళి బ్రాండ్ నుంచి బయటకు వచ్చి కార్తికేయ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే.. లేటెస్ట్ గా ‘ప్రేమలు’తో ప్రొడ్యూసర్ గా హిట్ కొట్టాడు కార్తికేయ. మలయాళం నుంచి తెలుగులోకి అనువాదమైన రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ప్రేమలు’ని ఇక్కడ ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. తెలుగు నేటివిటీకి సరిపోయే యూనివర్శల్ పాయింట్ కావడం.. పైగా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కావడంతో ‘ప్రేమలు’ చిత్రానికి ఇక్కడ మంచి ఆదరణ దక్కుతోంది. మొత్తంగా.. కార్తికేయ ‘ప్రేమలు’తో జాక్ పాట్ కొట్టినట్టే అంటున్నారు ట్రేడ్ పండిట్స్.