భావోద్వేగాల సాగరం ‘సప్త సాగరాలు దాటి సైడ్-బి’

నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, చైత్ర ఆచర్ అవినాష్, శరత్ లోహితాశ్వ, అచ్యుత కుమార్, పవిత్ర లోకేష్, రమేష్ ఇందిర, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే తదితరులు
దర్శకత్వం: హేమంత్ ఎం రావు
నిర్మాణ సంస్థ : ప‌రంవా స్టూడియోస్‌
తెలుగులో విడుదల చేసింది: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం : చరణ్ రాజ్
ఛాయాగ్రహణం : అద్వైత గురుమూర్తి
విడుదల తేదీ: నవంబర్ 17, 2023

ఈవారం థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో ‘సప్త సాగరాలు దాటి – సైడ్ బి‘ ఒకటి. సెప్టెంబర్ లో వచ్చిన ‘సప్త సాగరాలు దాటి – సైడ్ ఎ‘కి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందింది. కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి నటించిన ఈ ప్రేమకథ చిత్రం ఎలా ఉంది? ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ
మొదటి భాగంలో చేయని నేరాన్ని తనపై వేసుకుని జైలుకి వెళ్లిన మను (రక్షిత్ శెట్టి) తన పదేళ్ల శిక్ష నుంచి బయటకి వస్తాడు. తన ప్రేయసి ప్రియ (రుక్మిణి వసంత్)కి అప్పటికే పెళ్ళి అయిపోయి ఉంటుంది. దీంతో ఆమెని మర్చిపోలేక మను సతమతం అవుతుంటాడు. ప్రియని దూరం నుంచి ఫాలో అవుతూ ఆమె కుటుంబానికి అండదండలు అందిస్తుంటాడు. మరి.. చివరికు ప్రియను కలిశాడా? లేదా?. వేశ్య సురభి (చైత్ర ఆచార్)తో పరిచయం ఎలాంటి పరిస్థితులకు కారణమయ్యింది? తను జైలుకి వెళ్ళడానికి కారణమైన వాళ్లపై మను పగ తీర్చుకున్నాడా? అనేది మిగతా స్టోరీ.

విశ్లేషణ
మొదటి భాగంలో కనిపించిన మను (రక్షిత్ శెట్టి)కి.. రెండో భాగంలో మను పాత్రకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. తొలి భాగంలో హృద్యమైన భావోద్వేగాలు చూపిస్తే.. ఈ మలిభాగంలో ప్రతీకార కోణాన్ని ఆవిష్కరించాడు డైరెక్టర్ హేమంత్. ఈ సినిమాలోని థీమ్ కు సముద్రాన్ని సింబాలిక్ గా వాడుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ పార్ట్ లో సముద్రాన్ని ఎక్కువగా బ్లూ కలర్ లో చూపిస్తే.. సెకండ్ పార్ట్ లో రివెంజ్ కి సింబాలిక్ గా రెండ్ కలర్ లో చూపించాడు.

మొదటి భాగంలో కనిపించిన రక్షిత్ కి.. రెండో భాగంలో రక్షిత్ కి మేకోవర్ పరంగానూ చాలా వ్యత్యాసాలు కనిపిస్తాయి. మొదటి భాగంలో మృదువైనవాడుగా కనిపించిన హీరో.. రెండో భాగంలో తన ప్రతీకారం కోసం ఎదుటి వ్యక్తి ప్రాణాలను తీయడానికి సైతం వెనుకాడడు. ఓడిపోయిన ప్రేమికుడిగా ఎమోషనల్ సీన్స్‌లో రక్షిత్ నటన ఆకట్టుకుంటుంది. మొదటి భాగంలో తన నటనతో ఆకట్టుకున్న రుక్మిణి వసంత్ కి రెండో భాగంలో పెద్దగా నటనకు ఆస్కారం దొరకలేదు. ఈ పాత్ర ఎక్కువగా మౌనంగానే కనిపిస్తుంది. వేశ్య పాత్రలో కనిపించిన చైత్ర ఆచార్ కి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. తన పాత్రకు చైత్ర న్యాయం చేసింది. ఇంకా.. గోపాల్ పాల‌కృష్ణ దేశ్‌ పాండే, రమేష్ ఇందిర తమ పాత్రలకు న్యాయం చేశారు.

నటీ న‌టులు, హృద్యమైన భావోద్వేగాలు, క‌థ‌లోని ప్రతీకారం కోణం ఆకట్టుకున్నా.. నెమ్మదిగా సాగే సన్నివేశాలు ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెడతాయి. సాంకేతికంగా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

Related Posts