వ్యూహం సాంగ్.. జనానికి పిచ్చి ముదిరింది..

రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న పొలిటికల్ సినిమా వ్యూహం. కొన్నాళ్ల క్రితం వచ్చిన ఈమూవీ రెండు టీజర్స్ చూసిన తర్వాత అతని టార్గెట్ ఏంటో అందరికీ అర్థం అయింది. పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో ఒక చిన్న బిట్ కనిపిస్తేనే గగ్గోలెత్తిపోయారు వైసీపీ నాయకులు. బట్ వారికి పూర్తి అనుకూలంగా ఆయా పాత్రలు, పాత్ర ధారుల స్పష్టమైన గెటప్స్ తోనే ఈ వ్యూహం రూపొందింది. దీన్ని బట్టి ఈ సినిమా అసలు వ్యూహం ఏంటో అందరికీ అర్థం అయింది. ఓ వైపు తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఈ చిత్రాన్ని విడుదల కానివ్వం అంటున్నా.. వర్మ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ మూవీ నుంచి ఒక పాటను విడుదల చేశాడు.


కీర్తన శేష్ రాసి, పాడిన ఈ గీతాన్ని రాజశేఖర్ కంపోజ్ చేశాడు. పాటంతా జగన్ ను ఎలివేట్ చేస్తూ.. అతనికి వ్యతిరేకంగా ఉన్న వారి గురించిన పదాలు రాగానే చంద్రబాబు, సోనియా గాంధీ, పవన్ కళ్యాణ్ ల ఫోటోస్ విజువల్స్ తో నింపేశాడు. ఈ పాటలో జగన్ ను పోలీస్ లు అరెస్ట్ చేయడం నుంచి అతన్ని అంబులెన్స్ లో జైలుకు తీసుకువెళ్లిన విజువల్స్ తో పాటు సోనియా గాంధీని ఎదురించి తను ఓదార్పు యాత్ర చేపట్టడం వరకూ కనిపిస్తోంది.


మొత్తంగా సాంగ్ చివర్ లో చంద్రబాబు పాత్రధారిలా భార్య ఆయనతో అంటున్నట్టుగా .. ” ఏంటండీ ఆ జనం.. మా నాన్న వెంట కానీ వాళ్ల నాన్న వెంట కానీ ఇంతమంది జనం రావడం నేను చూళ్లేదు.. ” అనే డైలాగ్ ఉంది. దానికి చంద్రబాబు పాత్రధారిలా కనిపిస్తోన్న వ్యక్తి .. ” జనానికి బాగా పిచ్చి ముదిరింది.. ” అంటాడు. దీన్ని బట్టి ఆ నాయకుడికి జనం అంటే గౌరవం ఇదీ అని చెప్పడం వర్మ ఉద్దేశ్యంలా కనిపిస్తోంది. ఇక పాటైతే పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.

Related Posts