మెగాస్టార్ తో పోటీకి సిద్ధమవుతోన్న రెబెల్ స్టార్

మిగతా సీజన్లలో తమ సినిమాలను విడుదల చేసే కంటే.. సంక్రాంతి బరిలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు అగ్ర కథానాయకులు. పండగ సీజన్ కలిసి రావడం.. పిల్లలు, పెద్దలు అంతా కుటుంబ సమేతంగా సినిమాలు చూడడానికి ఆసక్తి చూపించడం వంటి అంశాలు సంక్రాంతి చిత్రాలకు బాగా కలిసొచ్చేవి. పైగా.. సినిమా టాక్ తో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాలకు సంక్రాంతి బరిలో కలెక్షన్ల వర్షం కురుస్తుంటోంది. ఈకోవలోనే.. రాబోయే సంక్రాంతి బరిలో ముందుగానే బెర్త్ కన్ఫమ్ చేసుకుంది మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’.

ఇప్పుడు మెగాస్టార్ తో పాటు రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా సంక్రాంతి బరిలో తన సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సంక్రాంతి కానుకగా ‘రాజా సాబ్’ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుసగా యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో అలరిస్తోన్న ప్రభాస్ ఈ సినిమాతో మళ్లీ డార్లింగ్ గా రొమాంటిక్ అవతార్ లో మురిపించబోతున్నాడు. అందుకే.. సంక్రాంతి బరిలో అసలు సిసలు కలర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘రాజా సాబ్’ నిలుస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.

సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004 సంక్రాంతికి చిరంజీవి ‘అంజి’, ప్రభాస్ ‘వర్షం’ సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో విడుదలయ్యాయి. అయితే.. ఆ ఏడాది సంక్రాంతి విన్నర్ గా ‘వర్షం’ చిత్రమే నిలిచింది. మరోవైపు రాబోయే సంక్రాంతికే దిల్ రాజు నిర్మాణంలో రూపొందే ‘శతమానం భవతి 2’ కూడా రానుంది. సంక్రాంతి ఇంకా 11 నెలలకు పైగానే సమయం ఉంది కాబట్టి.. ఇంకెన్ని చిత్రాలు పొంగల్ రేసులో నిలస్తాయో చూడాలి.

Related Posts