రానా .. నోరు జారనేలా.. వివరణ ఇవ్వనేలా

సాధ్యమైనంత వరకూ కాంట్రవర్శీస్ కు దూరంగానే ఉంటాడు రానా. నటుడుగా, నిర్మాతగా తన పనేంటో తను చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒక్కోసారి ఏదో విషయమై చెప్పిన మాటలు మరి దేనికో కనెక్ట్ అవుతాయి. అలాంటప్పుడు కోరుకోని వివాదం చుట్టుకుంటుంది. ఇప్పుడు దగ్గుబాటి రానాకు అలాంటిదే ఒకటి జరిగింది. రీసెంట్ గా దుల్కర్ సాల్మన్ నటించిన కింక్ ఆఫ్ కోత అనే సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు రానా. ఈ సందర్భంగా దుల్కర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. తనకూ అతనికి ఉన్న తేడా అంటూ ఒక సంఘటన వివరించాడు.

దుల్కర్ ఆ మధ్య ఓ హిందీ సినిమా చేస్తుండగా.. హీరోయిన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాడనీ.. ఆమె అతన్ని చాలా సేపు వెయిట్ చేయించిందనీ.. చిన్న షాట్ కే గంటల పాటు ఎదురుచూసేలా చేసిందనీ.. నాలుగు కార్లలో వచ్చి.. తన టీమ్ తో హడావిడీగా కనిపించిందనీ.. అయినా దుల్కర్ కొంచెం కూడా ఫీల్ అవలేదని చెప్పుకొచ్చాడు. ఆ షూటింగ్ కు తను కూడా వెళ్లానని చెబుతూనే.. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ హీరోయిన్ నాలుగు కార్లలో వెళితే దుల్కర్ కేవలం ఒకే కార్ లో కామ్ గా వెళ్లాడనీ.. తర్వాత తను ఆ నిర్మాతను అరగంట పాటు తిట్టానని చెప్పుకొచ్చాడు. ఇక్కడి వరకూ వీరి స్నేహం కనిపిస్తుంది. కానీ ఆ హీరోయిన్ ఎవరా అని ఆరాలు తీసిన ఆడియన్స్.. ఆమెను ‘సోనమ్ కపూర్’గా తేల్చారు.

సోనమ్ వల్లే దుల్కర్ ఇబ్బంది పడ్డాడని చెబుతూ.. సోషల్ మీడియాలో హంగామా మొదలుపెట్టారు. ఇది కాస్త ఆలస్యంగా రానా వరకూ చేరింది. అయితే తన ఉద్దేశ్యం సోనమ్ గురించి చెప్పడం కాదు అనీ.. అసలు ఆమె తన మైండ్ లోనే లేదన్నాడు. దుల్కర్ లాగే తనకు సోనమ్ కూడా మంచి ఫ్రెండ్ అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. తను చెప్పిన మాటలు ఇలా వేరుగా అర్థం కావడం బాధించిందన్నాడు. ఈ సందర్భంగా సోనమ్ కపూర్ కు క్షమాపణలు కూడా చెప్పాడు. ఇకనైనా ఈ డిస్కషన్స్ కు ఎండ్ పడాలని కోరుకుంటున్నా అంటూ ఒక పెద్ద నోట్ విడుదల చేశాడు.

అయినా ఇలాంటి సందర్భాల్లో ఫ్రెండ్స్ గా వారి గురించి మాట్లాడుకుంటే అయిపోతుంది. వేరే వారు లేనప్పుడు వారి గురించి మాట్లాడకూడదు. మాట్లాడినా కాస్త ముందు వెనక చూసుకోవాలి. లేదంటే ఇదుగో ఇలాగే నోరు జారి ఆపై నోట్స్ లో సారీ చెప్పాల్సి ఉంటుంది.

Related Posts