కోటానుకోట్లమందికి ఆరాధ్య దైవం రజనీకాంత్

దక్షిణాది భారతదేశంలో సినీ అభిమానులకు రజనీకాంత్ పేరు చెబితే చాలు అంతులేని ఆవేశంతో గంతులేస్తారు. హీరోయిజానికి తనదైన ప్రత్యేకతను ఆపాదించి, ఓ నూతన ఒరవడిని సృష్టించి, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఎల్లలు లేని మాస్ పాప్యులారిటీకి రజనీకాంత్ నిలువెత్తు నిదర్శనం. ఈరోజు (డిసెంబరు 12) రజనీకాంత్ పుట్టినరోజు.

1976లో మొదలైన రజనీకాంత్ సినీప్రయాణం మెల్లమెల్లగా సాగుతూ, క్రమక్రమంగా ఊపందుకుంది. అటు కమల్ హాసన్ అన్నీ విచిత్రమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటే, రజనీకాంత్ మాత్రం మాస్ క్యారెక్టర్స్ ద్వారా మాస్ ఆడియన్స్ గుండెల్లోకి, స్లమ్స్ లోని పూరిగుడిసెల్లోకి చొచ్చుకుపోయారు. రజనీకాంత్ సినిమా వస్తోందంటే చాలు మాస్ పిచ్చెక్కిపోయిన వాతావరణం తమిళనాట మొత్తం నెలకొంటుంది. ఆ డైలాగులు, ఆ హ్యాండ్ కటింగులు, ఆ హెయిర్ స్టయిల్.. అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది.

పలు స్ట్రెయిట్ మూవీస్ తో పాటు.. అనువాదాలతో తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు రజనీకాంత్. ఇక.. హిందీలో సైతం ‘హమ్, ఖూన్ కా కర్జ్, ఫూల్ బనే అంగారే’ లాంటివి రజనీకాంత్ ప్రాబల్యాన్ని ఎంతగానో చాటిచెప్పాయి. ‘రోబో’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించిన రజనీకాంత్.. మళ్లీ అలాంటి హిట్ కోసం పుష్కరకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ ఏడాది ‘జైలర్’తో మళ్లీ సూపర్ స్టార్ కి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ దక్కింది. ప్రస్తుతం కూతురు దర్శకత్వంలో ‘లాల్ సలామ్’తో పాటు ‘జై భీమ్’ ఫేమ్ TJ జ్ఞానవేల్ డైరెక్షన్ లో తన 170వ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా ఉంది.