విజయవాడలో ‘భారతీయుడు‘ సందడి

పాతికేళ్ల క్రితమే పాన్ ఇండియా సినిమా అంటే ఇది అంటూ రీజనల్ బారికేడ్స్ ను చెరిపేసిన మూవీ ‘భారతీయుడు‘. ఒరిజనల్ తమిళం కంటే మిన్నగా తెలుగులో ఈ చిత్రానికి కలెక్షన్లు వచ్చాయి. అలాగే.. హిందీలోనూ అనువాద రూపంలో అదరగొట్టింది. లాంగ్ గ్యాప్ తర్వాత ‘భారతీయుడు‘ సినిమాకి సీక్వెల్ గా ‘భారతీయుడు 2‘ని తీసుకొస్తున్నారు కమల్, శంకర్. స్వాతంత్ర్య సమరయోధుడు సేనాపతిగా కమల్ కనిపించబోతున్న ఈ చిత్రాన్ని.. నేటితరం ప్రేక్షకులకు అనుగుణంగా, సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఇటీవలే కమల్ బర్త్ డే స్పెషల్ గా ‘భారతీయుడు 2‘ నుంచి ఇంట్రో పేరుతో స్పెషల్ వీడియో రిలీజయ్యింది.

అయితే.. ఆమధ్య డబ్బింగ్ కూడా మొదలుపెట్టుకోవడంతో ‘భారతీయుడు 2‘ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందనుకున్నారు. కానీ.. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా.. రెండు వారాల పాటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, వైజాగ్ లలో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ విజయవాడలో సందడి చేస్తుంది. విజయవాడ గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల పహరలో ఈ సినిమా షూటింగ్ ని కొనసాగిస్తున్నాడు శంకర్.

మరోవైపు కమల్ బర్త్ డే స్పెషల్ గా ‘భారతీయుడు 2‘కి సంబంధించి నిన్న ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు శంకర్. సెట్స్ లో సేనాపతి పాత్రలో ఉన్న కమల్ కి శంకర్ సీన్ వివరిస్తోన్న ఫోటో ఇది. ఈ స్టిల్ లో వైట్ అండ్ వైట్ లో అదరగొడుతున్నాడు భారతీయుడు కమల్ హాసన్. త్వరలోనే ‘భారతీయుడు 2‘ విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారట.