ఐ బొమ్మ ఈజ్ బ్యాక్.. డౌన్ లోడ్ అవుతోంది

ఒకప్పుడు పైరసీ అనే మాట వింటే నిర్మాతల గుండెల్లో నష్టాలు పరుగులుపెట్టేవి. కాలం మారింది. అందుకు తగ్గట్టుగానే డిజిటల్ దొంగతనాలూ మారాయి. ఐ బొమ్మ అనే ఒక ఆప్షన్ వచ్చింది. దీని వల్ల ఓటిటి ల గుండెల్లో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇలా వచ్చిన సినిమాలు అలా ఐ బొమ్మలో ప్రత్యక్షం అవుతున్నాయి. పైగా క్వాలిటీ కూడా బెటర్ గానే ఉంటోంది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ మాగ్జిమం ఐ బొమ్మను డౌన్ లోడ్ చేసుకుని ఫోన్లలోనే కొత్త సినిమాలు చూస్తున్నారు. దీని వల్ల ఓటిటి వారికే కాదు.. థియేటర్స్ లో సైతం జనాలు సినిమాలు చూడటం బాగా తగ్గించారు. ఏదైనా పెద్ద స్టార్ అయితే తప్ప థియేటర్స్ వరకూ వెళ్లడం లేదు. ఐ బొమ్మ పూర్తిగా ఉచితంగా వచ్చే ఆప్షన్ కాబట్టి ఫ్యామిలీ అంతా ఇంట్లోనే చూస్తున్నారు. ఇలా ఉచితంగా సినిమాలు చూసేందుకు వేరే ఆప్షన్స్ ఉన్నా.. ఐ బొమ్మ చదువు రాని వారికి కూడా సులువుగా ఉంది. అందుకే దీనికి అంత డిమాండ్.


ఐ బొమ్మ లాంటి వెబ్ ఆప్షన్స్ వల్ల తాము నష్టపోతున్నాం అని ఓటిటి సంస్థల వాళ్లు వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నాయి. ఈ విషయంలో కొన్ని రోజుల క్రితం ఐ బొమ్మే ముందుకు వచ్చింది. ఇక పై తమ సైట్ లో సినిమాలు డౌన్ లోడ్ కావు అని చెప్పింది. నిజంగానే అప్పటి నుంచి డౌన్ లోడ్ ఆప్షన్ లేదు. ఈ మధ్య మరి ఏమైందో.. తమను అనవసరంగా కెలకొద్దంటూ ఐ బొమ్మ టీమ్ నుంచి ఇండస్ట్రీకి ఓ పెద్ద వార్నింగ్ వచ్చింది. అంతేకాదు.. తమను పట్టుకోవడం ఎవరి తరం కాదు అని చెబుతూ.. మమ్మల్ని రెచ్చగొడితే నష్టపోయేది మీరే అంటూ స్ట్రాంగ్ డోస్ తో ఓ లెటర్ కూడా విడుదల చేశారు. ఆ లెటర్ వచ్చి వారం కూడా కావడం లేదు.. అప్పుడే ఐ బొమ్మలో మళ్లీ డౌన్ లోడ్ ఆప్షన్ వచ్చింది.


ఈ సారి ఈ సైట్ కలర్ మారింది. ఇందుకు ముందు డార్క్ గ్రీన్ లో ఉండేది. ఈ సారి పసుపు రంగు వేసుకుని వచ్చింది. ఇప్పుడు కూడా కొత్త సినిమాలే ఆప్షన్స్ లో ఉన్నాయి. కొన్ని కొత్తగా ఓటిటిల్లో స్ట్రీమ్ అవుతున్న చిత్రాలు కూడా ఉండటం విశేషం. మరి నిజంగా ఐ బొమ్మ వారిని ఎవరైనా బెదిరించడం వల్లే మళ్లీ వెనక్కి వచ్చారా లేక వీళ్లు అప్డేట్ కావడానికి గ్యాప్ తీసుకున్నారా అనేది తెలియదు కానీ.. ఇప్పుడు థియేటర్స్ కు వెళ్లి ఒక కుటుంబం సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చవుతోంది. ఆ ఖర్చు చేయలేని వారికి ఈ సైట్ ఓ పెద్ద వరంలా మారింది. కానీ దీని వల్ల వేలమందికి ఉపాధి ఇస్తోన్న ఇండస్ట్రీ ఇబ్బంది పడుతోంది. దీంతో ఇది కరవమంట కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారింది.

Related Posts