దళపతి విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

మాస్ ఇమేజ్ పుష్కలంగా ఉన్న కథానాయకులకు అభిమానగణం అదిరిపోయే రేంజులో ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. ఫ్యాన్స్ ముద్దుగా ఇలయదళపతిగా పిలుచుకునే కోలీవుడ్ స్టార్ విజయ్ పుట్టినరోజు ఈరోజు (జూన్ 22).

తమిళంలోని పాపులర్ డైరెక్టర్ ఎస్.ఎ.చంద్రశేఖర్ తనయుడు విజయ్. చంద్రశేఖర్ తెలుగులోనూ చిరంజీవితో ‘చట్టానికి కళ్లు లేవు, పల్లెటూరి మొనగాడు, దేవాంతకుడు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక.. తండ్రి దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలలో బాల నటుడిగా నటించిన విజయ్.. 1992లో ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘నాలయ తీర్పు’ సినిమాతో 18 ఏళ్ల వయసులోనే హీరోగా పరిచయమయ్యాడు.

హీరోగా పరిచయమైన అనతికాలంలోనే తమిళ చిత్ర పరిశ్రమలో ఒన్ ఆఫ్ ది స్టార్ హీరోస్ గా ఎదిగాడు విజయ్. తెలుగులో మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు, పోకిరి’ సినిమాలను తమిళంలో ‘గిల్లీ, పోకిరి’గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. స్ట్రెయిట్ మూవీస్ తో పాటు రీమేక్స్ కు సమాన ప్రాధాన్యతనిస్తూ.. ఏడాదికి ఈజీగా మూడు, నాలుగు సినిమాలను విడుదల చేసేవాడు ఇలయదళపతి. అందుకే.. మన తెలుగు అగ్ర కథానాయకులు ఇంకా 30ల మైలురాయిలో ఉంటే.. విజయ్ మాత్రం అప్పుడే 68వ సినిమాకి చేరుకున్నాడు.

ప్రస్తుతం తమిళనాట విజయ్ క్రేజ్ ముందు ఏ కథానాయకుడు నిలబడే అవకాశం లేదనేది ట్రేడ్ వర్గాల టాక్. విజయ్ సినిమాలు బిజినెస్ పరంగా వందల కోట్లు కొల్లగొడుతుంటాయి.. విజయం, అపజయాలతో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తుంటాయి. పారితోషికం పరంగానూ విజయ్.. తమిళనాట అగ్రపథాన దూసుకుపోతున్నాడు. ఒక్కో సినిమాకి వంద కోట్లు పుచ్చుకుంటున్నాడట దళపతి.

తెలుగు ప్రేక్షకులు తమిళ నటులైన రజనీకాంత్, కమల్ హాసన్ లను తమ సొంత హీరోలుగా భావిస్తుంటారు. ఆ తర్వాత విక్రమ్, సూర్య, కార్తీ వంటి అలాంటి పేరును తెలుగులో సంపాదించారు. అయితే.. గత కొన్ని సంవత్సరాలుగా విజయ్ కూడా తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరవుతున్నాడు. ‘స్నేహితుడు, తుపాకీ, అదిరింది, మాస్టర్, వారసుడు’ వంటి చిత్రాలు తెలుగులోనూ మంచి వసూళ్లు సాధించాయి.

‘మాస్టర్’తో మెమరబుల్ హిట్ అందుకున్న విజయ్.. ‘బీస్ట్’ సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఇక.. పోయినేడాది సంక్రాంతి బరిలో ‘వారసుడు’గా ఆడియన్స్ ముందుకొచ్చాడు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించడం విశేషం. పొంగల్ సీజన్ కలిసి రావడంతో ‘వారసుడు’ చిత్రానికి అటు తమిళం.. ఇటు తెలుగులోనూ మంచి కలెక్షన్లు దక్కాయి.

‘వారసుడు’ తర్వాత విజయ్ తన 67వ చిత్రంగా ‘లియో’ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. ప్రస్తుతం తన 68వ చిత్రంగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ను తీసుకొస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదలకు ముస్తాబవుతోంది. విజయ్ బర్త్ డే స్పెషల్ గా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ తో పాటు.. ‘ది గోట్ బర్త్ డే షాట్స్’ పేరుతో స్పెషల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

Related Posts