వేసవి సినిమాలకు ఎన్నికల వేడి.. ‘కల్కి’ పోస్ట్ పోన్?

సంక్రాంతి తర్వాత టాలీవుడ్ కి అతిపెద్ద సీజన్ సమ్మర్. సినిమాలను అమితంగా ఇష్టపడే పిల్లలకు సెలవులు కావడంతో సమ్మర్ సీజన్ లో సినిమాల సందడి మామూలుగా ఉండదు. అందుకే వేసవి కానుకగా తమ చిత్రాలను విడుదల చేయడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు దర్శకనిర్మాతలు. ఈసారి వేసవి బరిలో చాలా సినిమాలు విడుదల తేదీలు ఖరారు చేసుకున్నాయి. వీటిలో ప్రభాస్ ‘కల్కి’ కూడా ఒకటి.

అయితే.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలైంది. లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో.. ఇప్పటికే వేసవి బరిలో విడుదల తేదీలు ఖరారు చేసుకున్న చిత్రాలు పునరాలోచనలో పడ్డాయట.

ఈనెలలో రాబోతున్న ‘ఓం భీమ్ బుష్, టిల్లు స్క్వేర్’ వంటి చిత్రాలపైనా.. ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే ‘ఫ్యామిలీ స్టార్‘పైనా ఎన్నికల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. అయితే.. మే నెలలో విడుదల తేదీ ఖరారు చేసుకున్న ‘కల్కి‘పైనే ఎక్కువగా ఎన్నికల ప్రభావం ఉండబోతుంది. ఎందుకంటే.. ‘కల్కి’ చిత్రం మే 9న విడుదల కానుంది. అంటే.. అప్పటికి కేవలం నాలుగు రోజుల్లోనే ఎన్నికలు జరుగుతాయి.

ఈనేపథ్యంలో.. ‘కల్కి’ కోసం మరో కొత్త తేదీని ఖరారు చేస్తారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి.. వైజయంతీకి బాగా కలిసొచ్చిన మే 9న కాదని.. మరే తేదీని ప్రకటిస్తారనేదే ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది.

Related Posts