అరుదైన ‘చిత్ర’కారుడు బాపు

అచ్చతెనుగు సినిమాకి కేరాఫ్ అడ్రస్సు సత్తిరాజు లక్ష్మీనారాయణ అలియాస్ బాపు. అరమరికలు లేని స్నేహానికి చిరునామా బాపు. సిల్వర్ స్క్రీన్ పై తెలుగు ధనాన్ని, కాన్వాస్ పై కొంటెదనాన్ని కలిపి గీసి, తీసిన చిత్రకారుడు బాపు. బాపు తెలుగు వారి ఆస్తి. ఆయన నిర్మించిన అపురూప కళాసంపద లో ఆయనెప్పుడూ జీవిస్తూనే ఉంటారు. ఈ కొంటెబొమ్మల బాపు జయంతి నేడు (డిసెంబర్ 15).

అరవై అయిదేళ్ల చిత్రకారుడు, యాభై ఏళ్ల చలనచిత్రకారుడు బాపులో ఉన్నారు. ‘బాపు బొమ్మ’ అనే మాట ఈరోజూ చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. తెలుగు సంస్కృతికీ సంప్రదాయాలకు అందచందాలకు బాపు గీసిన.. తీసిన బొమ్మలు ప్రత్యక్ష సాక్ష్యాలు. సినిమాలపై ఎలాంటి అవగాహన లేకుండానే సినీ పరిశ్రమలు అడుగుపెట్టి.. తొలి చిత్రం ‘సాక్షి’తోనే అందరి దృష్టి తనవైపు తిప్పుకునేలా చేసిన ప్రతిభాశాలి బాపు. తన దైన శైలిలో సినిమాలు తీయడమే కాకుండా, తీసిన వాటిన్నింటిలో తనదైన ముద్రను స్పష్టంగా కనబర్చారు.

రామాయణ గాథను పలుమార్లు పలు రూపాల్లో వెండితెరపై అద్భుతంగా మలిచిన ఘనత బాపుది. రామాయణసారం లేకుండా బాపు సినిమాలే లేవు. రామాయణ, మహాభారతాల్ని ఆధునీకరించి పలు సినిమాలు తెరకెక్కించారు బాపు. ఈ రెండు మహాకావ్యాల్ని అణువణువునా జీర్ణించుకుని.. ప్రతి కథనీ ఆకోణం నుంచే చూశారు తీశారు బాపు. ‘సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలు రామాయణ, మహాభారత ఇతివృత్తాలతోనే రూపొందాయి.

తెలుగులో తాను దర్శకత్వం వహించిన పలు చిత్రాలను హిందీలోనూ తెరకెక్కించారు బాపు. అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ నటులను హీరోగా పరిచయం చేసిన ఘనత బాపుదే. ఇక.. బాపు గురించి మాట్లాడుకునేట్టపుడు రమణ గురించి చెప్పకపోతే అది పూర్తవదు. వీరిద్దరూ ఒకే ఆత్మకు రెండు రూపాలు వంటి వారు. బాపు దృష్టి అయితే రమణ దాని భావం. బాపు చిత్రం అయితే రమణ దాని పలుకు. అందుకే వీరిద్దరి వెండితెర ప్రయాణమేకాదు. జీవన ప్రయాణం కూడా కలిసి కట్టుగానే సాగింది.

Related Posts