నటుడు పృథ్వీరాజ్‌ కి అరెస్ట్ వారెంట్

తెలుగు చిత్ర పరిశ్రమను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ అరెస్ట్ అయ్యింది. ఇప్పుడు మరో తెలుగు నటుడు పృథ్వీరాజ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఇంతకీ విషయమేమిటంటే.. టాలీవుడ్ లో ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’గా పేరుగాంచిన పృథ్వీరాజ్.. తన భార్య శ్రీలక్ష్మి మనోవర్తి కేసులో అరెస్ట్ వారెంట్ ను ఎదుర్కొంటున్నారు. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజ్ కి నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

పృథ్వీరాజ్ కి 1984లో శ్రీలక్ష్మితో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే పృథ్వీకి ఆయన భార్యకు వివాదాల ఏర్పడిన నేపథ్యంలో వారు విడిగానే ఉంటున్నారు. శ్రీలక్ష్మి తన పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటూ 2017లో కోర్టును ఆశ్రయించింది. తన భర్త సినిమాలు, టీవీ సీరియల్స్ చేస్తూ నెలకు రూ.30 లక్షల సంపాదిస్తున్నారు కాబట్టి.. అతన్నుంచి తనకు నెలకు రూ.8 లక్షలు భరణం ఇప్పించాలని కోరింది. అప్పట్లో ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.

అయితే.. ఆ ఆదేశాలను పాటించని పృథ్వీ హైకోర్టులో సవాలు చేశారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు రూ.22వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. దీంతో భార్య శ్రీలక్ష్మి మళ్లీ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేశారు. పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకావడం లేదని లాయర్లు పిటిషన్‌లో వివరించారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి బుధవారం పిటిషన్‌ను పరిశీలించారు. పృథ్విరాజ్‌కు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్ వారెంటు జారీ చేశారు.

Related Posts