ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

ఆంధ్రప్రదేశ్ నూతన టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా కందుల దుర్గేష్ నియమితులయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ తరపున నిడదవోలు నియోజకవర్గంలో విజయం సాధించారు కందుల దుర్గేష్. సినీ పరిశ్రమకు చెందిన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి వారు ప్రస్తుత ప్రభుత్వంలో ఉండడంతో.. ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో దోహదమయ్యే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలో.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ శాఖను ఎవరికి ఇస్తారు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా.. కందుల దుర్గేష్ కి సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించింది ఎ.పి. ప్రభుత్వం.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి పరిసర ప్రాంతాలు, మారేడుమిల్లి, విశాఖపట్టణం, అరకు వంటి ప్రదేశాలలో షూటింగ్స్ విరివిగా జరుగుతున్నాయి. ఇంకా.. ఎ.పి. లోని ఎన్నో అందమైన ప్రదేశాలలో షూటింగ్స్ చేసుకోవడానికి వీలుగా సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుందనే ఆశతో ఉంది సినీ పరిశ్రమ. అలాగే.. పెద్ద సినిమాల విషయంలో టిక్కెట్లు పెంచుకునే వెసులుబాటు, చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య వంటివి పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు రావాలని చిత్ర పరిశ్రమ ఆకాంక్షిస్తుంది. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ నియమితులైన నేపథ్యంలో.. ఆయనకు శుభాకాంక్షలు అందజేసింది తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్.

Related Posts