భారతీయ సినీ చరిత్రలో హిమశిఖరం

అమితాబ్ బచ్చన్.. భారతీయ సినీ చరిత్రలో ఆయనో హిమశిఖరం.. నిన్నటి తరంలో మెదలుపెట్టి నేటి తరాన్ని సైతం అలరిస్తూ అలుపెరగని ప్రయాణం సాగిస్తున్న నటుడతను. హీమ్యాన్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ అంటూ కీర్తించబడే ఆ వన్‌ అండ్‌ ఓన్లీ ఎవర్‌ గ్రీన్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌. నేడు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ 81వ పుట్టినరోజు.

అమితాబ్ బచ్చన్… ఈ పేరుకి మరో ఉపోద్ఘాతం అవసరమా? అసలు బచ్చన్ అనేదే బాలీవుడ్ చరిత్రకి ఒక ఇంట్రడక్షన్ లాంటి టైటిల్. అలాంటి లివింగ్ లెజెండ్ బాలీవుడ్ లో కాలుమోపి ఐదు దశాబ్దాలు దాటింది. భారతీయుల్లో హిందీ సినిమాల గురించి తెలియని వారుంటారేమో కాని అమితాబ్ బచ్చన్ పేరు తెలియని వారుండరు. అంతగా పాపులారిటి సంపాదించుకొన్న అమితాబ్‌ కు ఇంతటి పేరు ప్రఖ్యాతులు రాత్రికి రాత్రికి రాలేదు. ఒక్కసారి అతని ఐదు దశాబ్దాల తన సినీజీవితాన్ని పరికిస్తే అందులోని ఎత్తుపల్లాలు, జయాపజయాలు ఎన్నో మనకు గోచరిస్తాయి.

ఒక్కసారి నీ మెహం అద్దంలో చూసుకున్నావా.. నీవేంటి సినిమాల్లో హీరో ఏంటి? అని గేలి చేసినా తన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అవకాశాలను దక్కించుకొని చివరకు భారతీయ సినీ చరిత్రలో తన పేరును సువర్ణక్షరాలతో లిఖించుకున్నాడు అమితాబ్‌ బచ్చన్‌. తొలుత చిన్న పాత్రలతోనే అలరించినా ‘జంజీర్‌’ సినిమాతో నటుడిగా నిలదొక్కుకున్నాడు. ‘డాన్‌’, ‘ముకద్దర్‌ కా సికందర్‌, ది గ్రేట్‌ గ్యాంబ్లర్‌, మిస్టర్‌ నట్వర్‌ లాల్‌, కాలాపత్తర్‌, సుహగ్‌, దోస్తానా, నసీబ్‌, లావారిస్‌, సిల్‌ సిలా, యారానా, సత్తేపేసత్తా, శక్తి, అందాకానూన్‌’ వంటి బ్లాక్‌ బస్టర్స్ హిందీ చిత్ర సీమలో ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ గా నిలబెట్టాయి.

అమితాబ్‌ కెరీర్‌ స్వర్ణయుగంగా వెలుగుతున్న సమయంలోనే ‘కూలీ’ షూటింగ్‌ లో జరిగిన ప్రమాదం ఆయనను మృత్యువుకు చేరువుగా తీసుకెళ్లింది. అభిమానుల ప్రార్థనలు ఫలించే ఆ ప్రమాదం నుంచి త్వరగానే కోలుకున్నాడు. 90లలో సినిమాల నుంచి విరామం తీసుకుందామనుకున్న అమితాబ్ బచ్చన్.. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించేందుకు ఎ.బి.సి.ఎల్ ను ప్రారంభించాడు. పలు సినిమాలను నిర్మించిన ఎ.బి.సి.ఎల్ బచ్చన్ కు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఇక.. అప్పట్లో బచ్చన్ పీకల్లోతు కష్టాలలో ఉన్న సమయంలో.. బుల్లితెర కార్యక్రమం కె.బి.సి. అమితాబ్ ను ఆర్థికంగా ఆదుకుంది. కె.బి.సి. తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు బచ్చన్. ఒకవైపు స్మాల్ స్క్రీన్.. మరోవైపు బిగ్ స్క్రీన్ పై సపోర్టింగ్ రోల్ తో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు అమితాబ్ బచ్చన్.

అమితాబ్ బచ్చన్ కున్న లోతైన, గంభీర స్వరంతో అనేక కార్యక్రమాలలో కథకుడుగా, నేపధ్య గాయకునిగా, ప్రెజెంటర్ గా మంచి పేరు సంపాదించాడు. నాలుగు సార్లు జాతీయస్థాయిలో ఉత్తమనటుడిగా నిలిచిన అమితాబ్ బచ్చన్ ను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే తో పాటు.. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు వరించాయి. తన డైనమిజంతో భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన అమితాబ్‌ కు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఫ్యాన్స్‌ ఉన్నారు.. లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియమ్‌లో మైనపు ప్రతిమ ప్రతిష్టించబడిన తొలి భారతీయ నటుడు అమితాబ్‌. ప్రస్తుతం హిందీలో ‘గణపథ్‘ వంటి సినిమాతో పాటు దక్షినాదిన ప్రభాస్ తో ‘కల్కి 2898 ఎ.డి.‘ రజనీకాంత్ తో ‘తలైవర్ 170‘ సినిమాలలో నటిస్తున్నాడు అమితాబ్.

Related Posts