ఇక అందరి కళ్లూ విజయ్ పైనే

ఒక సినిమా హిట్ అయిందంటే ఆ తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ పై ఆ ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే తమిళ్ హీరోలంతాతెలుగు మార్కెట్ పై దండయాత్ర చేయాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నారు. దీనికి తోడు వెటరన్స్ అయిన కమల్ హాసన్, రజినీకాంత్ వంటి వారు యేడాదకొకరు చొప్పును తెలుగు సినిమాను షేక్ చేస్తున్నారు. బాక్సాఫీస్ ను కొల్లగొడుతున్నారు.

తాజాగా వచ్చిన రజినీకాంత్ జైలర్ 400 కోట్ల మార్క్ ను దాటింది. తెలుగులో బిగ్గెస్ట్ హిట్ గా మారింది.ఇక్కడ కొన్నవాళ్లంతా మూడో రోజుకే బ్రేక్ ఈవెన్ అయిపోయారు. మిగతా అంతా లాభాలే అంటున్నారు.ఇక ఈ మాట వినబోయే నెక్ట్స్ సినిమా ఏంటీ అంటే లియో అనే టాక్ బలంగా వినిపిస్తోంది.


విక్రమ్ తో కమల్ హాసన్ కు తిరుగులేని కమ్ బ్యాక్ ఇచ్చాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ మూవీ తెలుగులోనూ పెద్ద సక్సెస్అయింది. అతని దర్శకత్వంలో అక్కడి టాప్ హీరో విజయ్ హీరోగా రూపొందిన సినిమానే లియో. త్రిష హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్, అర్జున్ విలన్స్ గా నటించారు. ఈ యేడాది దసరా బరిలో అక్టోబర్ 19న తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోందీ సినిమా.

ఇప్పటికే తెలుగులో తనకంటూ కొంత మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్. దాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లే ఈ లియో అనేలా బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయి. దర్శకుడు లోకేష్ కావడంతో మనవాళ్లు కూడా మరీ ఎక్కువగా ఆలోచించేలా కనిపించడం లేదు. అందుకే లియో రైట్స్ కు భారీ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ కూడా భారీగానే చెబుతున్నారు.