నటుడిగా మారిన జాతిరత్నం

తెరవెనుక డైరెక్టర్ కుర్చీలో కూర్చునేవారు అప్పుడప్పుడూ తెరముందు కూడా సందడి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంతమంది డైరెక్టర్స్ అయితే రెగ్యులర్ యాక్టర్స్ లా బిజీ అయిన వారూ ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ తొలి తరంలో ఎల్వీ ప్రసాద్, కె.ఎస్.ప్రకాశరావు, వై.వి.రావు వంటి వారు దర్శకులుగానూ నటులుగానూ రాణించారు. ఇక ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన రికార్డు దర్శకరత్న దాసరి నారాయణరావు సొంతం. నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చిన దాసరి వెండితెరపై నటుడుగానూ సత్తా చాటారు.

గురువు దాసరి నారాయణరావు బాటలోనే శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా గుర్తింపు పొందారు కోడి రామకృష్ణ. దర్శకత్వంతో పాటు.. కొన్ని సినిమాలలో నటుడిగానూ తనదైన ప్రత్యేకతను చాటారు కోడి. ‘మూడిళ్ల ముచ్చట, ఇంటి దొంగ, అత్తగారూ స్వాగతం, ఆస్తి మూరెడు ఆశ బారెడు, దొంగాట’ వంటి చిత్రాలలో అతిథి పాత్రలలో అలరించారు కోడి రామకృష్ణ.

తెలుగు చిత్ర సీమకు పలు కళాత్మక సినిమాలు అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ కూడా నటుడిగా వెండితెరపై తనదైన ముద్ర వేశారు. కమల్ హాసన్ హీరోగా తానే దర్శకత్వం వహించిన ‘శుభసంకల్పం’ సినిమాతో నటుడిగా మారారు విశ్వనాథ్. ఆ తర్వాత ‘వజ్రం, కలిసుందాం రా, నువ్వు లేక నేను లేను, సంతోషం, ఠాగూర్, స్వరాభిషేకం, మిస్టర్ పర్ ఫెక్ట్, ఉత్తమ విలన్’ వంటి చిత్రాలలో సహాయ నటుడిగా మెప్పించారు.

అసలు హీరో అవుదామని చిత్ర పరిశ్రమకు వచ్చి దర్శకుడిగా సత్తా చాటారు ఎస్వీ కృష్ణారెడ్డి. దర్శకుడిగా వరుస విజయాలందుకుంటున్న సమయంలో నటుడిగా మారి తన ఆన్ స్క్రీన్ కలను సాకారం చేసుకున్నారు. ‘అభిషేకం, ఉగాది’ సినిమాలలో కథానాయకుడిగా నటించారు. అయితే ఎస్వీ కృష్ణారెడ్డికి హీరోగా ఆశించిన విజయాలు దక్కలేదు.

తెలుగు సినిమాకి కమర్షియల్ పాఠాలు నేర్పిన వశిష్టుడు విశిష్టుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. మామూలు స్థాయి నటులకు స్టార్ డమ్ తీసుకొచ్చిన దర్శకేంద్రుడు.. స్టార్ డమ్ ఉన్నోళ్లను లెజెండ్స్ గా నిలబెట్టారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్స్ గా దూసుకెళ్తున్న వెంకటేష్, మహేష్, అల్లు అర్జున్ లను హీరోలకు వెండితెరకు పరిచయం చేసిన ఘనత దర్శకేంద్రుడుదే. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు కొత్త ‘పెళ్లిసందడి’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. అయితే ‘పెళ్లిసందడి‘ అంతగా అలరించకపోవడంతో నటుడిగా రాఘవేంద్రరావుకి గుర్తింపు లభించలేదు.

దర్శకులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి నటులుగా సెటిలైన వారిలో కాశీ విశ్వనాథ్, దేవిప్రసాద్ వంటి వారిని చెప్పొచ్చు. వీరిద్దరూ ఇప్పుడు బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా దూసుకెళ్తున్నారు. ఇక ఇటీవలే విడుదలైన ‘పెదకాపు 1‘ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాలో నటుడిగా తన ఆహార్యం, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. కానీ ‘పెదకాపు 1‘ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోతుంది.

తాజాగా నటులుగా మారిన దర్శకుల లిస్టులోకి చేరబోతున్నాడు అనుదీప్.కె.వి. తొమ్మిదేళ్ల క్రితమే ‘పిట్టగోడ‘ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్.. ‘జాతిరత్నాలు‘ చిత్రంతో దర్శకుడిగా మంచి విజయాన్నందుకున్నాడు. ఇదే ఊపులో కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ తో బైలింగ్వల్ గా ‘ప్రిన్స్‘ మూవీని తెరకెక్కించాడు. కానీ ‘ప్రిన్స్‘తో హిట్ కొట్టలేకపోయాడు. ఇక లేటెస్ట్ గా అనుదీప్ యాక్టర్ గా టర్న్ తీసుకున్నాడు.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘మ్యాడ్‘ మూవీలో స్టూడెంట్ లీడర్ గా అలరించబోతున్నాడు అనుదీప్. లేటెస్ట్ గా రిలీజైన ‘మ్యాడ్‘ ట్రైలర్ లో అనుదీప్ పాత్ర ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 6న ‘మ్యాడ్‘ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Related Posts