కమల్ హాసన్ తో నటించాడు.. పేదరికంతో రోడ్ పై చనిపోయాడు

సినిమా పరిశ్రమ అనేది వైకుంఠపాళి. ఎప్పుడు ఎవరు అందలం ఎక్కుతారో.. ఎప్పుడు ఎవరు పాము నోట్లో చిక్కి అధపాతాళానికి చేరతారో చెప్పలేం. కొందరికి మాత్రం ఎలాగోలా గడిచిపోతుంది. శారీరక లోపాలున్న వారికి మాత్రం పరిశ్రమ ఎప్పుడూ పూలపాన్పు కాదు. అలా ఇప్పుడు ఓ నటుడు అనాథలా ఆకలికి తాళలేక రోడ్ పై పడి చనిపోయాడు. ఇతను మరుగుజ్జు నటుడు.

అతని పేరు మోహన్. పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేంత పెద్ద నటుడు కాదు. కానీ కమల్ హాసన్ ఎక్స్ పర్మెంటల్ మూవీ అపూర్వ సహోదరులు సినిమాలో కమల్ కు స్నేహితుడుగా సినిమా అంతా కనిపిస్తాడు. 1989లో విడుదలైన ఈ సినిమా తర్వాత మోహన్ కు మంచి గుర్తింపే వచ్చింది. కానీ తన శరీరం వల్ల ఎక్కువ అవకాశాలు రాలేదు. వచ్చిన ఆఫర్స్ తోనే అడపాడదపా నెట్టుకు వచ్చాడు. కొన్నాళ్ల క్రితం ఆర్య హీరోగా వచ్చిన నాన్ కడవుల్(నేనే దేవుడ్ని) సినిమాలోనూ నటించాడు.

బట్ అవకాశాలు లేకపోవడంతో మదురై సమీపంలోని తిరుపరంగుడ్రం అనే ఏరియాలో భిక్షాటన చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. జూలై 31న రోడ్ పై నిర్జీవంగా పడి ఉన్న అతన్ని కొంతమంది చూసి పోలీస్ లకు సమాచారం ఇచ్చారు. అప్పటికే చనిపోయిన అతని శవాన్ని మధురై ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. పోస్ట్ మార్టమ్ అనంతరం సొంతఊరికి అంబులెన్స్ లో తీసుకువెళ్లారు. అతనికి ఇద్దరు అన్నలు, ముగ్గురు అక్కలు ఉన్నట్టు సమాచారం.

Related Posts