70యేళ్ల నిరీక్షణ.. తెలుగు సినిమా నుంచి ఉత్తమ నటుడు అనే మాట వినేందుకు మన పరిశ్రమ ఎదురుచూసిన కాలం 70యేళ్లు. ఎంతోమంది మహా నటులు.. ఆ నాటి చిత్తూరు నాగయ్య, ఎస్వీ రంగారావు, రామారావు, నాగేశ్వరరావు నుంచి నేటి చిరంజీవి తరం దాటి ఇప్పుడున్న స్టార్స్ వరకూ.. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఒక నటుడు జాతీయస్థాయిలో ఉత్తమ నటుడు అనిపించుకుంటాడా అని ఇన్నేళ్లుగా ఎదురుచూశారు.
ఆర్ఆర్ఆర్ కు అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు చూసి అంతా ఎన్టీఆర్, రామ్ చరణలలో ఒకరికి.. లేదా ఇద్దరికీ నేషనల్ అవార్డ్ రావడం ఖాయం అనుకున్నారు. కానీ అనూహ్యంగా అది అల్లు అర్జున్ ను వరించింది. అలాగని ఐకన్ స్టార్ అర్హుడు కాదని కాదు. అతనూ హండ్రెడ్ పర్సెంట్ ఈ అవార్డ్ కు అర్హుడే.
ఇంకా చెబితే ఆ ఇద్దరికంటే ఇతనే బెస్ట్. చేసిన పాత్రతో పాటు సినిమాను తనొక్కడే మోశాడు. స్లాంగ్ నుంచి మేకోవర్ వరకూ సరికొత్త గా తనను తాను ఆవిష్కించుకున్నాడు. అన్నిటికి మించి ఆల్రెడీ ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ తో చేసిన సినిమా కాదు. అయినా ఈ మూవీతో జాతీయ స్థాయిలో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఎంతోమంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ఈ సినిమాలోని అతని మేనరిజమ్స్ ను ఇమిటేట్ చేశారు.. చేస్తూనే ఉన్నారు. ఆ కారణంగానే అవార్డుల విషయంలో కూడా తగ్గేదే లే అంటూ ఐకన్ స్టార్ ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడుగా తనను తాను ఆవిష్కించుకున్నాడు అని చెప్పాలి.
అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రావడం గొప్ప విషయం. కానీ ఈ పురస్కారం మనకు ఎప్పుడో రావాల్సింది అనేది వాస్తవం. నిజం.. మన పౌరాణికాలు, మన జానపదాలు, మన సాంఘికాలు, మన పురాణేతిహాసాలు, మనవే చారిత్రక కథలు ఎన్నో వెండితెరపై అద్భుత విజయాలు సాధించాయి. అందుకు కారణం ఆయా నటీ నటులు. ఆ మధ్య మెగాస్టార్ చెప్పినట్టు.. దశాబ్దాలుగా జాతీయ స్థాయిలో తెలుగు సినిమా నిర్లక్ష్యానికి గురైంది అనేది నిజం. ఆ నిజం నిగ్గు తేల్చి ఇవాళ తెలుగు సినిమా అంటే ఇండియన్ సినిమా ముఖ చిత్రంగా మారింది.
ఆ ముఖచిత్ర ఫలితమే మన పరిశ్రమ నుంచి 70యేళ్ల నిరీక్షణకు తెరపడింది. పుష్పలో అల్లు అర్జున్ చెప్పినట్టు ఇంకా అయిపోలేదు. చాలా చాలా ఉంది. రాబోయే రోజుల్లో అది మరింతగా కనిపిస్తుంది. కనిపించాలి కూడా. ఏదేమైనా ఇన్నేళ్ల నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టిన ఐకన్ స్టార్ కు హృదయ పూర్వక అభినందనలు.