‘వార్ 2‘ పనులు మొదలయ్యాయి

ఆర్.ఆర్.ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల రేసులో వెనుకబడ్డాడు అనే కామెంట్స్ వచ్చాయి. తన కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోవడంలో తారక్ విఫలమవుతున్నాడనే విమర్శలు వినిపించాయి. అయినా నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన అతనికి తెలియదా ఎప్పుడు ఏం చేయాలో అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాలి. ఇక లేటైనా లేటెస్ట్ గా వస్తానన్నట్టు ఇప్పుడు తారక్ సినిమాల లైనప్ఎంత క్రేజీగా ఉందో ఆయన సినిమాల సెలక్షన్ ను బట్టే తెలుస్తోంది.

ప్రస్తుతం ‘దేవర‘ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్న యంగ్ టైగర్ ఆ తర్వాత ‘వార్ 2‘ని పట్టాలెక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. ‘ఆర్.ఆర్.ఆర్‘తో టాలీవుడ్ లో అసలెవరూ ఊహించని మల్టీస్టారర్ కి నాంది పలికిన ఎన్టీఆర్ ఇప్పుడు ‘వార్ 2‘తో మరో సంచలనానికి తెరలేపబోతున్నాడు. కనీవినీ ఎరుగని రీతిలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నాడు. సూపర్ హిట్ మూవీ ‘వార్‘కి సీక్వెల్ గా.. ‘బ్రహ్మాస్త్ర‘ ఫేమ్ అయన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

తాజాగా ‘వార్ 2‘ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా డైరెక్టర్ అయన్ ముఖర్జీ హైదరాబాద్ వచ్చాడు. ఎన్టీఆర్ తో సినిమా డిస్కషన్స్ జరుపుతున్నాడు. ఈ ఏడాది చివరి నుంచి సెట్స్ పైకి వెళ్లి 2024 ప్రథమార్థం అంతా షూటింగ్ జరుపుకుని.. 2025 జనవరి 25న ‘వార్ 2‘ని విడుదల చేయాలనే ప్రణాళికలో ఉన్నారట మేకర్స్.

ఆమధ్య ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ‘యుద్ధభూమిలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటా మిత్రమా‘ అంటూ హృతిక్ రోషన్ ‘వార్ 2‘ షూటింగ్ త్వరలో మొదలవ్వబోతుందనే హింట్ ఇవ్వనే ఇచ్చాడు. మొత్తంమీద.. ‘వార్ 2‘తో ఎన్టీఆర్-హృతిక్ లు యుద్ధభూమిలో ఏ రీతిన తలపడతారో బాక్సాఫీస్ ను ఏ రీతిన కొల్లకొడతారో చూడాలి.

Related Posts