ఖిలాడీ డైరెక్టర్ కు మరో ఛాన్స్ ..?

కొందరికి అవకాశాలు అలా వచ్చేస్తుంటాయంటే. నిజానికి సినిమా పరిశ్రమలో కేవలం విజయాలను బట్టే అవకాశాలు వస్తాయి. కొందరు మాత్రం దీనికి మినహాయింపుగా ఉంటారు. ఆ మధ్య ఆ లిస్ట్ లో మెహర్ రమేష్‌ పేరు వినిపించింది. ఇప్పుడు రమేష్‌ వర్మ పేరు వినిపిస్తోంది. యస్.. కెరీర్ ఆరంభంలో మాస్ రాజా రవితేజతో వీర అనే ఊరమాస్ ఎంటర్టైనర్ తీసి అదే రేంజ్ లో డిజాస్టర్ చూశాడు రమేష్‌ వర్మ. దీంతో మళ్లీ ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. చాలా గ్యాప్ తర్వాత అనూహ్యంగా రాక్షసుడు రీమేక్ తో ఆఫర్ అందుకున్నాడు. అది కాపీ పేస్ట్ సినిమా అయినా తెలుగులోనూ సూపర్ హిట్ కావడంతో మాస్ రాజా మరో ఛాన్స్ ఇచ్చాడు. రవితేజ ఇమేజ్ కు తగ్గ కథగా ఖిలాడీ అనే సినిమా చేశాడు. పాయింట్ బానే ఉన్నా.. ఎగ్జిక్యూషన్ సరిగా లేక ఖిలాడీ కూడా ఫ్లాప్ అయింది. దీంతో ఇక రమేష్‌ వర్మ పని ఐపోయిందనే అనుకున్నారు అంతా. బట్.. మళ్లీ మాస్ రాజానే మరో ఛాన్స్ ఇచ్చాడు రమేష్‌ కు తనతోనే రెండు సినిమాలు చేశాడు అన్న నమ్మకమో లేక .. నిజంగానే అతని టాలెంట్ పై నమ్మకమో తెలియదు కానీ.. రవితేజ ఈ దర్శకుడిని మళ్లీ నమ్మాడు. అయితే ఈ సారి తనకోసం కాదు.

ఓ అతి ముఖ్యమైన బాధ్యత ఇచ్చాడు. అది కూడా తన వారసుడిలాంటి కుర్రాడిని హీరోగా పరిచయం చేసే బాధ్యత. యస్.. కొన్నాళ్ల క్రితం తనతో పాటు కొన్ని సినిమాల్లో నటించిన రవితేజ సోదరుడు రఘు కొడుకు మాధవ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. తమ్ముడి కొడుకు హీరో అంటే అన్ని బాధ్యతలూ తనే చూసుకోవాలి కదా.. అందుకే ఈ రెస్పాన్సిబులిటీ రమేష్‌ వర్మకు ఇచ్చాడు రవితేజ. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.ఈ చిత్రానికి రమేష్‌ వర్మ దర్శకుడు కాదు. కేవలం కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. దర్శకత్వం ఓ కొత్త కుర్రాడికి ఇవ్వాలనుకుంటున్నారట. అంటే అర్థం కావడం లేదూ.. సినిమా పోతే ఆ దర్శకుడి అకౌంట్ లో వేస్తారు. ఆడితే రమేష్‌ వర్మ అకౌంట్ లో పడుతుంది. ఏం జరిగినా ఇతని ఇమేజ్ కు డ్యామేజ్ రాదు. దాన్ని బట్టి తను మరో సినిమా చేసుకోవడానికి సెంటిమెంట్స్ అడ్డు రావు. మరి ఈ కొత్త కుర్రాడిని హీరోగా నిలబెట్టేందుకు రమేష్‌ వర్మ ఎలాంటి ప్లానింగ్ తో వస్తాడో చూడాలి.