ఆ తమిళ్ బ్లాక్ బస్టర్ తెలుగువాళ్లను మెప్పిస్తుందా

కాంతార ఇచ్చిన ఊపుతో మళ్లీ తెలుగులో డబ్బింగ్ సినిమాల దందా మొదలు కాబోతున్నట్టు కనిపిస్తోంది. కాంతార సినిమా అనూహ్యంగా పెట్టుబడికి మూడింతలు లాభాలు తెచ్చింది. దీంతో నిన్నటి వరకూ కాస్త డల్ గాఉన్న డబ్బింగ్ మార్కెట్ కు కొత్త ఊపొచ్చింది. విశేషం ఏంటంటే.. ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలను చిన్న, మధ్య తరగతి నిర్మాతలు విడుదల చేసేవారు. కొన్నాళ్లుగా టాప్ ప్రొడ్యూసర్సే డబ్బింగ్ సినిమాలను తెస్తున్నారు. అల్లు అరవింద్ తీసుకువచ్చిన కాంతార అందుకు మరో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మరి అరవింద్ ఇచ్చిన ఊపును, తెచ్చుకున్న లాభాలనూ తనూ సాధించాలనుకుంటున్నాడేమో.. ఈ సారి దిల్ రాజు కూడా డబ్బింగ్ సినిమాను తీసుకురాబోతున్నాడు. రాజు తెస్తున్నది ఓ తమిళ్ సినిమా. అతి చిన్న సినిమాగా వచ్చి ఇప్పుడు కోలీవుడ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోన్న ఆ మూవీ లవ్ టుడే.లవ టుడే పేరుతో తెలుగులో అప్పట్లో ఉదయ్ కిరణ్‌ ఓ సినిమా చేశాడు. కానీ అప్పటికీ ఇప్పటికీ లవ్ టుడే అనే మాటలతో విపరీతమైన మార్పులు తెచ్చింది స్మార్ట్ ఫోన్. ఆ ఫోన్ చుట్టూనే ఈ చిత్ర కథను రాసుకున్నాడు హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్. ఇతను గతంలో జయం రవితో కోమలి అనే సినిమా డైరెక్ట్ చేశాడు.