ఏసుదాస్ పంచిన గాన మాధుర్యం

కె.జె.ఏసుదాస్.. అమృతగళం అనే పదానికి ఆయన గాత్రమే నిర్వచనం. మధురగానంతో మరపురాని గీతాలెన్నో ఆలపించిన మనకాలపు లెజెండరీ సింగర్. ఏ భాషలో పాడినా ఆ సాహిత్య ఔన్నత్యాన్ని రెట్టింపు చేసిన ప్రతిభాశాలి. ఐదున్నర దశాబ్ధాలకు పైగా గానయానం సాగిస్తూ.. శ్రోతలను మైమరపిస్తోన్న మధురగాయకుడు ఏసుదాస్ పుట్టినరోజు ఈరోజు (జనవరి 10)

ఏసుదాస్ తెలుగువారు కాకపోయినా తెలుగునాట ఆయన ఎందరి మదిలోనో గుడి కట్టుకున్నారు. తన గాన మాధుర్యంతో తెలుగునాట కూడా ఆయన సుధలు పంచారు. ఆ సుధామృతంతో ఈ నాటికీ ఎందరో అభిమానులు ఆనందతాండవం చేస్తూనే ఉన్నారు. ఏసుదాస్ పాడితే ఆ పాటకు ఓ ప్రత్యేకత ఉండి తీరాలనేది శ్రోతల అభిప్రాయం. దాదాపు అందరు సంగీత దర్శకుల దగ్గరా ఆయన పాటలు పాడారు. బాలసుబ్రహ్మణ్యం వేవ్ ఉదృతంగా ఉన్న సందర్భంలో సైతం జేసుదాస్ మాత్రమే పాడాలని కొన్ని పాటలు ఆయనతోనే పాడించుకున్నారు సంగీత దర్శకులు.

తెలుగు టాప్ హీరోస్ గా వెలిగిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ నటించిన చిత్రాల్లోనూ ఏసుదాస్ గానం జనాన్ని పరవశింపచేసింది. కథను మలుపు తిప్పే సన్నివేశాల్లో ఏసుదాస్ గానం సదరు చిత్రాల్లో ఎంతగానో అలరించింది. దాసరి రూపొందించిన ‘మేఘసందేశం’లో ఏసుదాస్ గానం చేసిన ‘ఆకాశ దేశానా…’ పాటతో ఆయనకు బెస్ట్ సింగర్ గా నేషనల్ అవార్డు లభించింది. ఆయా చిత్రాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఏసుదాస్ గానం ఈ నాటికీ పరవశింపచేస్తూనే ఉండడం విశేషం.