సాహసానికి మారుపేరు సూపర్‌స్టార్ కృష్ణ

చురుకైన చూపులు.. చురకత్తి లాంటి దేహం.. చూడగానే ఆకట్టుకునే రూపం.. కృష్ణ సొంతం. అందుకే ఆయనకు ఊహించనంత వేగంగా వచ్చింది హీరో అవకాశం. ‘తేనెమనసులు’ చిత్రంతో హీరోగా పరిచయమై.. అదే మనసుతో పరిశ్రమలో ఎందరో మనసులు చూరగొని.. ఒక్కోమెట్టు ఎదుగుతూ సూపర్ స్టార్ అయ్యారంటే కారణం.. దేనికీ వెరవని నైజం. అనుకున్నది చేసే ధైర్యం.. అవే కృష్ణను డేరింగ్ అండ్ డాషింగ్ హీరోను చేశాయి. తెలుగు సినిమా కీర్తిని అందనంత ఎత్తుకు తీసుకువెళ్ళిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. సినిమా పరిశ్రమలో సాహసానికి మారుపేరుగా నిలిచిన బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ జయంతి ఈరోజు (మే 31).

సాహసమే ఊపిరిగా తెలుగు సినిమాను శ్వాసించిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. కథానాయకుడిగా 345 సినిమాలు.. దర్శకుడిగా డజనుకు పైగా చిత్రాలు.. నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 సినిమాలు.. మొదటి సినిమాస్కోప్ ఆయనదే. మొదటి 70 ఎమ్.ఎమ్. చిత్రం కూడా ఆయనదే.. అనితర సాధ్యం ఈ ట్రాక్ రికార్డ్. సాహసానికి మారుపేరైన సూపర్‌స్టార్ కృష్ణ చిత్రపరిశ్రమలో ఎన్నో సంచలనాలకు, ఎన్నో ప్రయోగాలకు కేంద్రబిందువుగా నిలిచారు.

తెలుగులో ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచిన కృష్ణ.. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ తరహా మూవీలో నటించిన ఘనత సాధించారు. కృష్ణ సినిమాల్లోకి ప్రవేశించిన సమయంలోనే హాలీవుడ్ లో తొలి జేమ్స్ బాండ్ మూవీ ‘డాక్టర్ నో’ రిలీజై ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఆ సినిమా ప్రేరణతో తెలుగులో తొలి జేమ్స్ బాండ్ మూవీగా ‘గూఢచారి 116’ చేశారు కృష్ణ. ఆ తర్వాత జేమ్స్ బాండ్ తరహాలోనే ‘లవ్ ఇన్ ఆంధ్రా, అందరికీ మొనగాడు, మాస్టర్ కిలాడి, జేమ్స్ బాండ్ 777, ఏజెంట్ గోపీ, రహస్య గూఢచారి, గూఢచారి 117’ వంటి చిత్రాలలో నటించారు.

తెలుగు వెండితెరకు కొత్త వెలుగులు తెచ్చినవాడు సూపర్ స్టార్ కృష్ణ. సాహసానికి మారుపేరైన కృష్ణ తెలుగు సినిమా హిస్టరీలో నిలిచిపోయే ఎన్నో ప్రయోగాలు చేశారు. తెలుగులో తొలి ఈస్ట్ మన్ కలర్.. తొలి తెలుగు కౌబాయ్.. తొలి తెలుగు స్కోప్.. తొలి తెలుగు 70 ఎమ్.ఎమ్.. ఇలా.. తెలుగు సినిమాకి ఎన్నో.. ఎన్నెన్నో సాంకేతిక సొబగులు అద్దిన సాహస సామ్రాట్ కృష్ణ.

తెలుగు సినిమాకి సంక్రాంతి సీజన్ ఎంతో ప్రత్యేకం. సంక్రాంతి బరిలోనే తమ సినిమాలను విడుదల చేయాలని పట్టుబడుతుంటారు స్టార్ హీరోలు. అయితే.. ఈతరమే కాదు.. ఆ తరం నుంచీ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సమరం అనేది ఎంతో ప్రత్యేకంగా నిలుస్తూనే ఉంది. ఇక సంక్రాంతి సీజన్లలో ఏకంగా 21 సినిమాలు విడుదల చేసి సంక్రాంతి స్టార్ గా నిలిచారు సూపర్ స్టార్.

హీరోగా తెరపైనే కాదు.. దర్శకుడిగా తెర వెనుక కూడా అద్భుతాలు సృష్టించారు కృష్ణ. డైరెక్టర్ గా 14 చిత్రాలను తెరకెక్కించారు. ఆయన తన తొలి చిత్రం ‘సింహాసనం’తోనే తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డు స్థాయి వసూళ్లు సాధించారు. ఈ సినిమాని ఒకేసారి తెలుగుతో పాటు హిందీలోనూ డైరెక్ట్ చేసిన ఘనత కృష్ణది.

ఈతరంలోని అగ్ర కథానాయకులు ఏడాదికి, రెండేళ్లకు ఒక సినిమాని కూడా విడుదల చేయడం కష్టంగా మారింది. అయితే.. ఒకే ఏడాదిలో 18 సినిమాలను విడుదల చేసి సరికొత్త రికార్డును సృష్టించారు సూపర్ స్టార్ కృష్ణ. అది కేవలం ఒక ఏడాదికే పరిమితం కాదు.. కృష్ణ తన కెరీర్ మొత్తంగా అదే దూకుడును ప్రదర్శించారు.

నేటితరంలో బిరుదులనేవి ఎవరికి వారు తగిలించుకుంటున్నారు. అయితే.. ప్రేక్షకుల చేత సూపర్ స్టార్ గా ఎన్నుకోబడిన అరుదైన ఖ్యాతి మాత్రం కృష్ణదే. వరుసగా కొన్నేళ్లపాటు ప్రేక్షకుల చేత సూపర్ స్టార్ గా ఎన్నుకోబడి.. తెలుగు చిత్ర సీమలో ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ గా నిలిచిపోయారు కృష్ణ. ఆయన లాంటి అరుదైన నటుడు ఏ చిత్ర పరిశ్రమలోనూ లేరని ఖచ్చితంగా చెప్పొచ్చు.. హీరోగా సినిమాల్లో ఎన్నో సాహసాలు చేసిన ఆయన పరిశ్రమ మనిషిగానూ అన్నే సాహసాలు చేశారు.

2022, నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల్ని శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మొత్తంమీద కృష్ణ లాంటి అరుదైన నటుడు ఏ చిత్ర పరిశ్రమలోనూ లేరని ఖచ్చితంగా చెప్పొచ్చు. సూపర్ స్టార్ కృష్ణ సినిమా రంగానికి చేసిన సేవలను ఎన్ని తరాలైనా ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరనేది నిజం.

Related Posts