‘నర్తనశాల‘ చిత్రానికి అరవై ఏళ్లు

తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఉత్తమోత్తమ చిత్రాలలో ‘నర్తనశాల‘ సినిమా ఒకటి. పాండవుల ఇతివృత్తంతో ఎన్.టి.ఆర్. అర్జునుడు పాత్రలో.. పౌరాణిక బ్రహ్మ కమల కామేశ్వరరావు తెరకెక్కించిన చిత్రం ఇది. 1963, అక్టోబర్ 11న ‘నర్తనశాల‘ సినిమా విడుదలైంది.

మహాభారతంలోని ‘విరాట పర్వం’లో జరిగిన పాండవుల అజ్ఞాతవాస గాథ ఈ చిత్రానికి ఇతివృత్తం. జూదంలోని షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు 12 ఏళ్ళ అరణ్యవాసం ముగించుకొన్న తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సమయం ఆసన్నమవుతోంది.

ఆ సమయంలో విరాటరాజు కొలువులో పాండవులు అజ్ఞాతవాసాన్ని గడిపిన ఇతివృత్తంతో ‘నర్తనశాల‘ సినిమా రూపొందింది.

ఈ సినిమాలో అర్జునుడు, బృహన్నల గా ఎన్టీఆర్ నటించారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి భక్తి, ఆకర్షణీయమైన పాత్రలు చేసిన ఎన్.టి.రామారావును ఈ చిత్రంలో బృహన్న పాత్రకు ఎంపిక చేయడం ఓ సాహసం. ఇక.. ద్రౌపది, సైరంద్రి పాత్రల్లో సావిత్రి, కీచకుడు గా ఎస్.వి.రంగారావు తమ నట విశ్వరూపాన్ని చూపించారు. ఉత్తర కుమారుడు పాత్రలో రేలంగి హాస్యం కూడా ‘నర్తనశాల‘ విజయంలో కీలక భూమిక పోషించింది. సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన ఈ సినిమాలోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. రాజ్యం పిక్చర్స్ బ్యానర్ పై సి.లక్ష్మీ రాజ్యం, సి. శ్రీధర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.