‘సలార్‘ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి

‘సలార్‘ విడుదలకు ఇంకా కేవలం 12 రోజులు మాత్రమే ఉంది. చిత్రబృందం ప్రచారం విషయంలో ఎలాంటి హడావుడి చేయకపోయినా.. సైలెంట్ గా విడుదలకు సంబంధించిన పనులన్నీ పూర్తిచేస్తున్నారు. లేటెస్ట్ గా ‘సలార్‘ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయట. ఈ చిత్రానికి ‘ఎ‘ సర్టిఫికెట్ జారీ చేసిందట సెన్సార్ బోర్డ్. గతంలో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కె.జి.యఫ్‘ సిరీస్ రెండు చిత్రాలకు ‘యు/ఎ‘ సర్టిఫికేట్స్ వచ్చాయి. ఇప్పుడు ‘సలార్‘ మాత్రం పెద్దలకు మాత్రమే అన్న కేటగిరీలో ఉండబోతుంది. అందుకు ముఖ్య కారణం ఈ సినిమాలో చూపించే రక్తపాతమే.

‘సలార్‘ రన్ టైమ్ 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లు అని తెలుస్తోంది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకూ ఇండియాలో ఏ సినిమా ట్రైలర్ కూడా సాధించనటువంటి వ్యూస్ రికార్డును ఇది నెలకొల్పింది. త్వరలోనే ఇంకొక ట్రైలర్ ను విడుదల చేసే సన్నాహాల్లో ఉందట టీమ్. ప్రభాస్ ఆద్యంతం కనిపించేలా ఆ యాక్షన్ ట్రైలర్ ను కట్ చేస్తున్నారట. ఈ సినిమాలో పృథ్వీరాజ్, శ్రుతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా, శ్రీయ రెడ్డి, ఈశ్వరిరావు, టినూ ఆనంద్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. హోంబలే ఫిల్మ్స్ రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించింది.