సినీ కార్మికుల సమ్మె సమరం ..

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అన్నట్టుగా
సినిమా నిర్మాణానికి లైట్లెత్తిన కూలీలెవ్వరు
భారీ క్రేన్లను మోస్తూ మేకప్ చెరగని నటుల వెనక చెమట వానై తడిసిందెవరు
స్టార్ల తళుకులకు రంగులద్దిన హంగులెవరివి
రంగుల ప్రపంచం అనే మాటకు కలర్స్ నింపిన కళాకారులెవ్వరు..
తొలిపొద్దు పొడవక ముందే యూనియన్ ఆఫీస్ ల్లో చేరి
వచ్చిన వాహనాల్లోనే మూటల్లా కుక్కినా కిక్కురుమనకుండా కూర్చుని
సూర్యోదయానికే సెట్స్ లో అడుగుపెట్టి.. స్టార్స్ వచ్చేసరికే అంతా సెట్ చేసి
లైట్స్, కెమెరా, యాక్షన్ అనే మాటలకు ముందు మౌనంగా పనిచేస్తూ
పేకప్ అనే మాట వినిపించేంత వరకూ అర్ధరాత్రైనా..అక్కడే ఉంటూ
కాయకష్టం చేసినా శ్రమకు తగ్గ ఫలం లేదని ఆక్రోశిస్తోన్న
కోట్ల రూపాయల వ్యాపారంలో కనిపించని వాటాదారులెందరు..?
కడుపు నిండా కూడు పెట్టి తమ కడుపు నిండకున్నా కళకు తోడుగా నిలిచిందెవ్వరు
ఎండలోనూ, వానలోనూ, చలిలో సైతం చెమటలు పట్టినా సేద దీరేందుకు ఇంత జాగా లేకున్నా
జానెడు పొట్ట కోసం బారెడు కష్టం చేస్తూ
24క్రాఫ్ట్ ల్లో ఉన్నాం అన్న సంతోషం కనిపించినా..
24 రోజులు కూడా పని దొరకని పరిశ్రమలో
కష్టానికి తగిన ప్రతిఫలం కోసం కార్మిక శక్తిలా కదం తొక్కుతోన్న
సినీ జీవులది న్యాయమైన డిమాండ్.. శ్రమను గౌరవించే వారంతా
తెలుగు సినిమా పరిశ్రమలోని 24క్రాఫ్ట్స్ వారు చేస్తోన్న సమ్మెకు మద్దతుగా నిలవాలి..

Related Posts