సినిమా హ‌ల్లో త‌నిఖీలు, స్వ‌చ్చందంగా థియేట‌ర్ల మూసివేత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని సినిమా హ‌ల్లో ఉన్న‌తాధికారులు త‌నిఖీలు చేస్తుండ‌డంతో థియేట‌ర్ల యాజ‌మాన్యాల్లో క‌ల‌క‌లం మొద‌లైంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగ‌ళ‌వారం నుంచి థియేట‌ర్లో త‌నిఖీలు చేస్తున్నారు. జీవో 30 ప్ర‌కారం థియేట‌ర్లో ఉండాల్సిన వ‌స‌తులు, టిక్కెట్ల ధ‌ర‌లు, క్యాంటీన్లో విక్ర‌యించే తినుబండారాల ధ‌ర‌లు అనుమ‌తి ప‌త్రాల‌ను ప‌రిశీలిస్తున్నారు. వాట‌ర్ బాటిల్స్ ను ఎక్కుక రేటుకు అమ్ముతున్నార‌ని.. నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని కొన్ని థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌కు నోటీసులు జారీ చేయ‌డం జ‌రిగింది.

ఇలా ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ను త‌నిఖీలు చేసి.. నిబంధ‌న‌లు పాటించ‌డం లేద‌నే కార‌ణం చెప్పి నోటీసులు జారీ చేస్తుండ‌డంతో థియేట‌ర్ల యాజ‌మాన్యాలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు. కార‌ణం ఏంటంటే.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే టికెట్ల అమ్మకాలు కొనసాగించాలన్న అధికారుల ఆదేశాలతో థియేటర్లను మూసివేశారు. జిల్లాలో 50కి పైగా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేయ‌డం జ‌రిగింది.

క‌రోనా కార‌ణంగా సినిమా ఇండ‌స్ట్రీకి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. థియేట‌ర్ల ఓన‌ర్స్.. సిబ్బంది ఎంత‌గానో న‌ష్ట‌పోయారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకుంటున్న త‌రుణంలో ఏపీ ప్ర‌భుత్వం ఇలా ఇబ్బందుల‌కు గురి చేస్తుంది అంటూ ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, థియేట‌ర్ల ఓన‌ర్స్, డిస్ట్రిబ్యూట‌ర్స్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. సంక్రాంతికి భారీ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఉన్న థియేట‌ర్లే స‌రిపోవ‌డం లేదు. అలాంటిది ఉన్న థియేట‌ర్లో కొన్నింటిని మూసివేస్తే.. ఇంకా ఇబ్బంది. అందుచేత‌.. ప్ర‌భుత్వం బాగా ఆలోచించి ఇండ‌స్ట్రీకి ఉప‌యోగ‌ప‌డేలా మంచి నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కోరుకుంటున్నారు.