అత్యధిక వేతనం కలిగినభారత సంతతి సీఈవో నికేశ్ అరోరా బయోగ్రఫీ

ప్రపంచ మార్కెట్​లో భారతీయులకు ఉన్న డిమాండ్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న భారత సంతతి సీఈఓల జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. సత్య నాదెళ్ల, అర్వింద్​ కృష్ణ, షాంతను నారేయన్, సుందర్ పిచ్చయ్ వంటి వారు భారతీయ ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు.

అసలు భారత సంతతికి చెందిన వారు సీఈఓలుగా పనిచేయడం 1990 దశకంలో మొదలైంది. రాహ్మ్​ అండ్​ హాస్​ ఛైర్మన్​, సీఈఓగా రాజ్​గుప్తా బాధ్యతలు చేపట్టడంతో కొత్త శకానికి నాంది పలికినట్టు అయ్యింది. ఆ తర్వాత అంతర్జాతీయంగా పలు అగ్ర సంస్థలకు సీఈవో లుగా భారతీయులు ఎంపికయిన సందర్భాలు ఏడాదికేడాదికి పెరుగుతూ వస్తున్నాయి. భారత సంతతి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీల్లో వివిధ స్థానాల్లో కొనసాగుతూ.. దేశ ప్రతిష్ఠను మరింత పెంచుతున్నారు.

ఇక.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అత్యధిక వేతనాలు పొందుతున్న సీఈవోలలో తాజాగా భారత సంతతికి చెందిన నికేశ్‌ అరోరా అగ్ర స్థానంలో నిలిచారు. నికేశ్ అరోరా 2023లో అమెరికాలో అత్యధిక వేతనం పొందిన సీఈవోగా రెండో స్థానంలో నిలిచారు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం.. అత్యధిక వేతనం పొందిన టాప్ 500 సీఈవోలలో 17 మంది భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు. భారతీయ సంతతి వారందరిలో అగ్ర స్థానంలో నిలిచారు నికేష్ అరోరా. నికేశ్‌ అరోరా వేతనం 151.43 మిలియన్‌ డాలర్లు.. అంటే రూపాయల్లో సుమారు రూ.1,260 కోట్లు.

ఉత్తరప్రదేశ్ ఘజియబాద్ లో ఫిబ్రవరి 9, 1968న పుట్టారు నికేశ్ అరోరా. ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న నికేశ్‌ అరోరా.. ఆ తర్వాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ నుంచి బి.టెక్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత బోస్టన్ కాలేజీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో ఎమ్.ఎస్. చేశారు.

ఇక.. మొట్టమొదటిసారిగా గూగుల్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. 2014లో సాఫ్ట్‌బ్యాంక్‌కు నాయకత్వం వహించారు. సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ అయిన పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌కు 2018 నుంచి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన వేతనం ముఖ్యంగా షేర్లు, ఈక్విటీ అవార్డులతో కూడి ఉంటుంది.

Related Posts