‘గామి‘ టీజర్.. అఘోర శంకర్ గా అదరగొడుతోన్న విశ్వక్ సేన్

నేటితరం యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ విభిన్నమైన శైలిని ఏర్పరచుకున్న నటుడు విశ్వక్ సేన్. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగానూ తన విలక్షణతను చూపిస్తుంటాడు. ఇక.. పాత్రల ఎంపికలో ఎంతో విభిన్నంగా దూసుకెళ్లోన్న ఈ యంగ్ హీరో.. తాజాగా ‘గామి‘ అంటూ ఓ విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇప్పటివరకూ ఎక్కువగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ లో నటించిన విశ్వక్ సేన్.. ‘గామి‘ సినిమాలో తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన అఘోర పాత్రలో అలరించబోతున్నాడు. ఓ అఘోరా హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో అఘోర శంకర్‌ గా విశ్వక్‌సేన్‌ కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమాలో కనిపించే క్యారెక్టర్స్ తో స్పెషల్ టీజర్ రిలీజ్ చేసింది టీమ్.విశ్వక్ సేన్ తో పాటు చాందిని చౌదరి, ఎమ్.జి.అభినయ పాత్రలు ఈ టీజర్ లో కనిపించాయి. విద్యాధర్ కాగిత దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాని కార్తీక్ శబరీష్ నిర్మిస్తుండగా.. యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది. మార్చి 8న విడుదలకు ముస్తాబవుతోన్న ‘గామి‘ ట్రైలర్ ను ఫిబ్రవరి 29న విడుదల చేయబోతున్నారు.

Related Posts