‘రాజు యాదవ్’ మూవీ రివ్యూ

నటీనటులు: గెటప్ శ్రీను, అంకిత కారట్‌, ఆనంద చక్రపాణి, రాకెట్‌ రాఘవ, మిర్చి హేమంత్‌, జబర్దస్త్‌ సన్నీ తదితరులు
సినిమాటోగ్రఫి: సాయిరామ్‌ ఉదయ్‌
సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్‌
ఎడిటింగ్‌: బి.నాగేశ్వర్‌రెడ్
నిర్మాతలు: రాజేశ్‌ కళ్లేపల్లి, ప్రశాంత్‌రెడ్డి
దర్శకత్వం: కృష్ణమాచారి
విడుదల తేది: 24-05-2024

‘జబర్దస్త్’ ప్రోగ్రామ్ లో వెరైటీ గెటప్స్ తో ఆడియన్స్ ను అలరించే గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వేణు ఊడుగుల వద్ద ‘నీది నాది ఒకే క‌థ‌, విరాట‌ప‌ర్వం’ చిత్రాల‌కు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా ప‌నిచేసిన కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గెటప్ శ్రీనుకి జోడీగా అంకిత క‌ర‌త్ నటించగా.. ఆనంద్ చక్రపాణి, రూపాల‌క్ష్మి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ‘రాజు యాదవ్’ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కృష్ణమాచారి. ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పరచుకున్న ‘రాజు యాదవ్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
డిగ్రీ వరకూ చదువుకున్న రాజు యాదవ్ (గెట‌ప్ శ్రీను).. ఉద్యోగం లేక స్నేహితులతో సరదాగా తిరుగుతుంటాడు. క్రికెట్ ఆడుతున్న‌ప్పుడు ముఖానికి బాల్ త‌గిలి తీవ్రంగా గాయ‌ప‌డ‌తాడు. స‌రైన వైద్యం అంద‌కపోవ‌డంతో ఎప్పుడూ న‌వ్వు మొహంతోనే క‌నిపిస్తూ ఉండాల్సి వ‌స్తుంది. ఆపరేషన్ చేస్తే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ చెబుతాడు. కానీ.. ఆపరేషన్ కి డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలోకి స్వీటీ (అంకిత కారట్) వస్తోంది. ఆమెకోసం త‌న సొంతూరుని వ‌దిలి హైద‌రాబాద్ వెళ‌తాడు. ఆమె కోసమే క్యాబ్ డ్రైవ‌ర్ అవ‌తార‌మెత్తి ఆమె చుట్టూనే తిరుగుతుంటాడు. ఆ తర్వాత రాజు జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? స్వీటీ.. రాజును ప్రేమించిందా?చివరికి రాజు యాదవ్ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.

విశ్లేషణ
జీవితంపై ఎలాంటి అవగాహన లేకుండా తిరిగే ఓ యువకుడి కథ ఇది. ఎదుటి వ్య‌క్తి ఇష్టాయిష్టాల్ని ప‌ట్టించుకోకుండా ప్రేమ పేరుతో వెంటపడి.. వాళ్లు తమను ప్రేమిస్తున్నారని అపొహపడే కాలం అంతా వృధా చేసుకునే యువకుల గురించి వింటూనే ఉంటాం. ఈ సినిమా కథ కూడా అలాంటిదే. అప‌రిప‌క్వ‌మైన ఆలోచ‌న‌లున్న ఓ యువ‌కుడి ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ కృష్ణమాచారి.

ఇది నిజంగా జరిగిన కథే అయినా.. ఆ స్టోరీలోని భావాలను వెండితెరపైకి తీసుకురావడంలో దర్శకుడు ఇంకాస్త కసరత్తులు చేస్తే బాగుండేది అనిపిస్తుంది. కథ పరంగా చూస్తే రాజు.. స్వీటీని అంత అమితంగా ఇష్టపడటానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడైపోతాడో కూడా అర్ధం కాదు. వాళ్లిద్దరూ కలవడానికి కానీ.. విడిపోవడానికి కానీ.. బలమైన సన్నివేశాలు కనిపించవు.

ప్ర‌థ‌మార్ధం సినిమా అంతా హీరో, అత‌ని స్నేహితులు, మ‌ధ్య త‌ర‌గతి జీవితం చుట్టూ సాగుతుంది. క్రికెట్ బాల్ త‌గిలాక క‌థానాయ‌కుడి ముఖ క‌వ‌ళిక‌ల్లో మార్పు రావ‌డం.. ఆ నేప‌థ్యంలో పండే హాస్యం కాస్త కాల‌క్షేపాన్ని పంచుతుంది. అయితే.. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ముందే ఊహించేలా సన్నివేశాలు సాగడం కూడా ఈ సినిమాకి మైనస్‌గా మారింది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
బుల్లితెరపైనే ఎన్నో గెటప్పులు వేసి.. ఎలాంటి కష్టతరమైన పాత్రనైనా అలవోకగా పోషించే సత్తా ఉన్న నటుడిగా నిరూపించుకున్నాడు గెటప్ శ్రీను. ఈ సినిమాతో హీరోగా మారిన గెటప్ శ్రీను.. తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్ లోనూ, ఎమోషనల్ సీన్స్ లోనూ తన హావభావాలతో అలరిస్తాడు. ఎప్పుడూ మొహంపై నవ్వు ఉండే పాత్ర అంటే సవాల్‌తో కూడుకున్న పనే. అయితే గెటప్ శ్రీను చాలా అలవోకగా ఆ పాత్రను చేశాడు.

ఇక హీరోయిన్ గా నటించిన అంకిత కారట్ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. హీరోకి తండ్రిగా నటించిన ఆనంద చక్రపాణి తన నటనతో ఆకట్టుకున్నారు. ఇంకా.. సంతోష్ కల్వచర్ల, మిర్చి హేమంత్ వంటి వారు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక విషయానికొస్తే.. దర్శకుడు కృష్ణమాచారి మంచి ఎమోషనల్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నా.. దాన్ని తెరపైకి తీసుకురావడంలో ఇంకాస్త కసరత్తులు చేయాల్సింది. సాయి రామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు రాజేష్ కల్లేపల్లి, ప్రశాంత్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా
గెటప్ శ్రీను తన నటనతో ఆకట్టుకున్నాడు. ద్వితియార్థంలో కొన్ని సన్నివేశాలు బాగున్నా.. ఆసక్తి రేకెత్తించని కథ, కథనాలతో ‘రాజు యాదవ్’ అక్కడక్కడా మెప్పిస్తుందంతే.

రేటింగ్:1.75/ 5

Related Posts