విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ జయంతి

తెలుగు చలనచిత్ర సీమ స్వర్ణయుగంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా పలు విలక్షణ పాత్రలతో అలరించిన విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు. ఈరోజు (జూలై 3) ఎస్వీఆర్ జయంతి.

ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 1918 జూలై 3న కృష్ణా జిల్లాలోని నూజివీడులో జన్మించారు. డిగ్రీ చదివే రోజులలో ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ వంటి పాత్రలు పోషించి రంగస్థల కళాకారుడిగా ఖ్యాతిని సంపాదించారు. తమ బంధువు బి.వి.రామానందం నిర్మించిన ‘వరూధిని’ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి కథానాయకుడిగా పరిచయమయ్యారు ఎస్వీఆర్. అయితే.. తొలి చిత్రం రంగారావుకు నిరాశనే మిగిల్చింది.

తొలి సినిమా పరాజయం పాలవ్వడంతో.. కొద్ది రోజుల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై నటనను పునః ప్రారంభించారు. ఈసారి చిన్న పాత్రలతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరిశారు. ‘పల్లెటూరి పిల్ల, మనదేశం, తిరుగుబాటు’ వంటి చిత్రాలలో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు వేశారు. అప్పుడే ప్రారంభించిన విజయా ప్రొడక్షన్స్ వారి తొలి చిత్రం ‘షావుకారు’లో ఎస్వీఆర్ వేసిన సున్నపు రంగడు పాత్రకు మంచి పేరొచ్చింది.

విజయా ప్రొడక్షన్స్ లోనే రూపొందిన ‘పాతాళభైరవి’ సినిమాలోని నేపాల మాంత్రికుడు రోల్.. ఎస్వీఆర్ కెరీర్ నే మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత ఎస్వీ రంగారావు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘పాతాళభైరవి’ తర్వాత కేవలం తెలుగులోనే కాకుండా పరభాషలలోనూ ఫుల్ బిజీ అయ్యారు. తమిళం, హిందీ భాషలలోని పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించి మంచి పేరు సంపాదించారు. ఇక.. తెలుగులో ఎస్వీఆర్ ఎలాంటి గుర్తింపు సంపాదించారో.. తమిళంలోనూ అంతే స్థాయి ఆదరణ దక్కించుకున్నారు.

ఎస్వీఆర్ ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలు కలబోసిన సహజ నటుడిగా పేరుగాంచారు. రంగారావుకు తొలినాళ్ళలో మంచి పేరు తెచ్చిన ‘షావుకారు‘ చిత్రంలోని సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకుని అతని మాట తీరుని, ప్రవర్తనా విధానాన్ని అనుకరించారట. ‘సంతానం’ చిత్రంలో అతను పోషించిన గుడ్డివాని పాత్ర కోసం కొన్నాళ్ళు పాటు అంధుల ప్రవర్తనను గమనించారట.

నట యశస్వి గా పేరు పొందిన ఎస్వీఆర్.. మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా నటించారు. ‘పెళ్లి చేసి చూడు’లో ధూపాటి వియ్యన్న, ‘మాయాబజార్’లో ఘటోత్కచుడు, ‘సతీ సావిత్రి’ లో యముడు, ‘భక్త ప్రహ్లాద’లో హిరణ్యకశిపుడు, ‘శ్రీకృష్ణ లీలలు’లో కంసుడు, ‘నర్తనశాల’లో కీచకుడు, ‘హరిశ్చంద్ర’లో హరిశ్చంద్రుడు, ‘సంపూర్ణ రామాయణం’లో రావణుడు, ‘దీపావళి’లో నరకాసురుడు, ‘బొబ్బిలి యుద్ధం’లో తాండ్ర పాపారాయుడు వంటి పాత్రలు ఎస్వీఆర్ కు విశేషమైన ఖ్యాతిని ఆర్జంపజేశాయి.

ఎస్వీఆర్ నటుడుగానే కాకుండా దర్శక-నిర్మాతగానూ అలరించారు. రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం ‘చదరంగం’ ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం ‘బాంధవ్యాలు’ తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి. ఇక.. ‘నర్తనశాల’ చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్.

Related Posts