విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో ‘లైలా’

పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి మన కథానాయకులు ఎలాంటి సాహసాలు చేయడానికైనా సిద్ధమవుతుంటారు. అలాంటి క్యారెక్టర్స్ లో లేడీ గెటప్ ఒకటి. అనాది నుంచి మహిళా పాత్రల్లో అలరించిన నటులు చాలామంది ఉన్నారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మహిళా పాత్రలతో ఎన్నో నాటకాల్లో నటించారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు లేడీ గెటప్స్ లో మురిపించారు.

‘నర్తనశాల’ కోసం బృహన్నలా అదరగొట్టారు నటరత్న నందమూరి తారకరామారావు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న బాలకృష్ణ కూడా బృహన్నల పాత్రలో కాసేపు మురిపించిన సంగతి తెలిసిందే. ఇక.. మెగాస్టార్ చిరంజీవి ‘చంటబ్బాయి’ కోసం లేడీ గెటప్ లో అదరగొడితే.. ‘మేడమ్’ సినిమాకోసం మహిళగా మురిపించాడు నటకిరీటి రాజేంద్రప్రసాద్.

మరో సీనియర్ కామెడీ స్టార్ నరేష్ ‘చిత్రం భళారే విచిత్రం’ కోసం లేడీ గెటప్ లో నటించి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మంచు మనోజ్ కూడా ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మహిళా పాత్రలో మురిపించాడు. తెలుగు హీరోలతో పాటు.. తమిళ కథానాయకులు కొంతమంది మహిళా పాత్రల్లో పర్ఫెక్ట్ గా సూటయ్యారు. వారిలో కమల్ హాసన్, విక్రమ్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్ వంటి వారిని చెప్పొచ్చు.

లేటెస్ట్ గా తెలుగులో విలక్షణంగా దూసుకెళ్తున్న విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమాకోసం లేడీ గెటప్ లో మురిపించబోతున్నాడు. ఈరోజే ముహూర్తాన్ని జరుపుకున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

రామ్ నారాయణ్ ఈ సినిమాని డైరెక్టర్. లేటెస్ట్ గా రిలీజైన ‘లైలా’ ఫస్ట్ లుక్ లో లేడీ గెటప్ లో అదరగొడుతున్నాడు విశ్వక్ సేన్.

Related Posts