కీరవాణి అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేసిన ‘జయ జయహే తెలంగాణ’ అనే గీతాన్ని ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేయిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే కీరవాణి మూలాలు ఆంధ్ర ప్రాంతానికి చెందినవి కావడంతో ఈ విషయం మీద పెద్ద చర్చ జరుగుతోంది. అందుకు ప్రధాన కారణం ఈ గీత రచయిత అందెశ్రీ చేసిన కొన్ని వ్యాఖ్యలు.

తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర ప్రాంత కీరవాణి సంగీతాన్ని ఇవ్వడం ఏంటని.. గీత రచయిత అందెశ్రీకి.. దర్శకుడు ప్రేమ్‌రాజ్ ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అందెశ్రీ సమాధానం అతడిని సంతృప్తిపరచకపోగా కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది. తెలంగాణ ఇచ్చింది ఇటలీ వనిత సోనియా అని అన్నారు అందెశ్రీ. ఇటలీ వనిత ఇచ్చిన తెలంగాణను స్వాగతించినప్పుడు.. ఈ పాటను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించిన ఫోన్ సంభాషణ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

తెలంగాణ ఆత్మగౌరవంగా భావించే రాష్ట్ర గీతానికి ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎలా మ్యూజిక్ ఇస్తారు అనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే రికార్డింగ్ సెషన్స్ కూడా మొదలైనట్లుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద స్పందించారు. రాష్ట్ర గీతాన్ని స్వరపరిచే విషయం అందెశ్రీకి అప్పగించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ జరిపిన రేవంత్ రెడ్డి.. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదని తెలిపారు. ఎవరితో సంగీతం చేయించుకోవలనేది అందెశ్రీ నిర్ణయానికే వదిలేశామని చెప్పారు.

జయజయహే తెలంగాణ పాట రాసిన అందెశ్రీ కే పాట రూపకల్పన బాధ్యతలు ఇచ్చామని తెలిపారు. అందెశ్రీయే కీరవాణిని ఎంపిక చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. సంగీత దర్శకుడి ఎంపికలో తన పాత్ర లేదన్న రేవంత్ రెడ్డి రాచరికం ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికారిక చిహ్నం రూపొందించాలని నిర్ణయించామని తెలిపారు. అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదని, సమ్మక్క, సారక్క – నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకి అద్దం పట్టేలా చిహ్నం ఉంటుందని చెప్పారు. పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం రూపొందిస్తామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతాన్ని కంపోజ్ చేసే అవకాశాన్ని కీరవాణికి ఇవ్వడం పట్ల ఆయన మద్దతుదారులు ఒకవైపు.. ఇది సరికాదని వ్యతిరేకిస్తున్న వర్గం ఇంకోపక్క సోషల్ మీడియాలో డిబేట్లు చేస్తూనే ఉన్నాయి.

Related Posts