పృథ్వీరాజ్ సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం‘ ట్రైలర్

నేటితరం మలయాళీ స్టార్స్ లో అగ్రపథాన దూసుకెళ్తున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. హీరోగా విభిన్నమైన కథాంశాలలో నటించే పృథ్వీరాజ్ ‘సలార్‘తో తెలుగు ప్రేక్షకులకూ బాగా సుపరిచితుడు. ఈ వెర్సటైల్ యాక్టర్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ది గోట్ లైఫ్‘. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. ‘ది గోట్ లైఫ్‘.. ‘ఆడు జీవితం‘ పేరుతో ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

మార్చి 28న విడుదలకు ముస్తాబవుతోన్న ‘ఆడు జీవితం‘ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథతో.. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందిన తొలి భారతీయ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో పృథ్వీరాజ్ కి జోడీగా అమలా పాల్ నటించింది. ట్రైలర్ లో ఆమె విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇంకా.. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీకి మరో ఆస్కార్ విజేత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్.

Related Posts