ఈ వారం థియేటర్లలోకి వచ్చే చిత్రాలు

ప్రతి వారం తరహాలోనే ఈ వారం కూడా పలు కొత్త చిత్రాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది సుధీర్ బాబు ‘హరోం హర’. ఆద్యంతం చిత్తూరు, కుప్పం నేపథ్యంలో ఈ సినిమాని జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించాడు. సుధీర్ బాబు కి జోడీగా మాళవిక శర్మ నటించిన ఈ సినిమాలో సునీల్, జయ ప్రకాష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలలో సుధీర్ బాబు మేకోవర్, డైలాగ్ డెలివరీ సరికొత్తగా ఉన్నాయనే కాంప్లిమెంట్స్ వచ్చాయి. 2 గంటల 34 నిమిషాల రన్ టైమ్ తో జూన్ 14న ‘హరోం హర’ ఆడియన్స్ ముందుకు వస్తోంది.

ఈ వారం వస్తోన్న చిత్రాలలో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ మరొకటి. విభిన్నమైన పాత్రలతో క్యారెక్టర్ యాక్టర్ గా ఫుల్ బిజీగా సాగుతోన్న అజయ్ ఘోష్ హీరోగా నటించిన చిత్రమిది. ఈ సినిమాలో అజయ్ ఘోష్ కి భార్య పాత్రలో సీనియర్ హీరోయిన్ ఆమని నటించగా.. ఇతర కీలక పాత్రలో చాందినీ చౌదరి కనిపించబోతుంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి రచన, దర్శకత్వం వహించారు. ఆర్థిక పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు అనుకూలించకపోయినా.. తానో డి.జె. కావాలని ఆశపడే మూర్తిగా అజయ్ ఘోష్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.

‘మ్యూజిక్ షాప్ మూర్తి’తో పాటు చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన మరో సినిమా ‘యేవమ్’. వ‌శిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వంలో నవదీప్‌, పవన్‌ గోపరాజు ఈ సినిమాని నిర్మించారు. మహిళా సాధికారికతను చాటి చెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందినట్టు మేకర్స్ తెలుపుతున్నారు.

యానియా, అంకిత, అజయ్‌ ప్రధాన పాత్రల్లో స్టీఫెన్‌ పల్లం స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఇంద్రాణి’. ఈ సినిమా కూడా జూన్ 14న విడుదలవుతోన్న సినిమాల లిస్ట్ లో ఉంది. ఇండియన్‌ సూపర్‌ ఉమన్‌ కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కించిన ‘ఇంద్రాణి’ ఖచ్చితంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని భావిస్తోంది టీమ్.

ఈ వారం తమిళం నుంచి అనువాద రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది విజయ్ సేతుపతి ‘మాహారాజ’. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి 50వ చిత్రమిది. ఈ సినిమాకి నిథిలన్ సామినాథన్ దర్శకుడు. ఈ మూవీలో ‘మహారాజ’గా టైటిల్ రోల్ లో కనిపించబోతున్నాడు విజయ్ సేతుపతి. మమతా మోహన్ దాస్, అభిరామి, నటరాజ్, భారతీరాజా, అనురాగ్ కశ్యప్ వంటి వారు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఓ స్ట్రెయిట్ మూవీకి చేసిన తరహాలోనే తెలుగులో ‘మహారాజ’ పబ్లిసిటీ నిర్వహించారు మేకర్స్.

Related Posts