హేమ పై నిరాధార ఆరోపణలు చేయొద్దన్న మంచు విష్ణు

బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ ను కుదిపేస్తోంది. బెంగళూరు రేవ్‌ పార్టీలో లో నటి హేమ ఉందంటూ బెంగళూరు సిటీ కమిషనర్‌ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆమె బ్లడ్ శాంపిల్స్ పరీక్షించారు. ఆమె మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు అందులో నిరూపితమైంది. ఈ నేపథ్యంలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఈకోవలోనే.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి ఆమెను బహిష్కరించాలనే వాదన మొదలైంది.

తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఈ విషయంపై స్పందించారు. ‘ఎక్స్‘ వేదికగా హేమ ఇన్సిడెంట్ గురించి ఓ పోస్ట్ చేశారు విష్ణు. ‘సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది నెటిజన్స్ హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒక తల్లిగా, భార్యగా ఉన్న ఆమెపై లేని వదంతులు సృష్టించడం, వ్యక్తిగతంగా దూషించడం తగదు. నిర్ధారణ లేని, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలి. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలి‘ అని తన పోస్ట్ లో తెలిపారు విష్ణు.

‘అలాగే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుందని.. ఒకవేళ హేమకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలను పోలీసులు అందిస్తే ‘మా’ అసోసియేషన్ తగిన చర్యలు తీసుకుంటుందని‘ విష్ణు తెలిపారు. మరోవైపు ఈ కేసులో నటి హేమకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Related Posts