లేడీ సింగం ఎస్.పి. మలికా గార్గ్ బయోగ్రఫీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ వేళ, పోలింగ్ తర్వాత అనేక ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా దాడులతో అట్టుడికి పోయింది. టిడిపి, వైసిపి వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు హింసాత్మకంగా మారి పల్నాడులో శాంతిభద్రతల సమస్య ఏర్పడింది. పల్నాడులో పోలింగ్ రోజు మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా చోటు చేసుకున్న దాడులతో అక్కడ శాంతిభద్రతలు అదుపుతప్పాయి.

కర్రలు, రాళ్లు, రాడ్లు, కత్తులు పెట్రోల్ బాంబులు, నాటు బాంబులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో దాడుల్లో చాలా మందికి గాయాలయ్యాయి. పల్నాడు రక్తసిక్తమైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి. పల్నాడులో శాంతి భద్రతలను కాపాడి, అల్లర్లను కంట్రోల్ చేయడంలో జిల్లా పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందడంతో ఈసీ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పై వేటు వేసింది.

ఈనేపథ్యంలో.. తాజాగా పల్నాడు జిల్లాకి నూతన ఎస్పీగా మహిళా ఐపీఎస్ అధికారి మలికా గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ బిందు మాధవ్ స్థానంలో మలికా గార్గ్ ను కొత్త ఎస్పీగా నియమించారు. ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన ఎస్పీ మలికా గార్గ్ పల్నాడు జిల్లాలో ప్రశాంత నెలకొల్పడానికి కృషి చేస్తానని చెప్పారు. జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడడం తన మొదటి లక్ష్యం అని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో శాంతిభద్రతలు కాపాడడంపై ప్రధానంగా దృష్టి సారిస్తానని మీడియాకి తెలిపారు.

అలాగే.. ఇటీవల కొన్ని ఘటనల కారణంగా పల్నాడులో శాంతిభద్రతలు అదుపు తప్పాయని.. రాజకీయ పార్టీల నాయకులు చట్టాన్ని అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవని మలికా గార్గ్ హెచ్చరించారు. పోలీసు అధికారులు తప్పు చేసినా ఉపేక్షించబోనని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం మలికా గార్గ్ చెప్పారు.సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ ఘర్షణలు జరగకుండా మాచర్ల నియోజకవర్గం లోని వెల్దుర్తి , రెంటచింతల, కారంపూడి, దుర్గి మాచర్లలో, ప్రతి ఫ్యాక్షన్ గ్రామాలలో ఇప్పటికీ ఫ్యాక్షన్ తగాదాన్ని నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని మలికా తెలిపారు. ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆయా మండలాల్లో మరోసారి అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్పారు.

సమయం కూడా చాలా తక్కువ ఉన్నందున అన్ని గ్రామాలను జల్లెడ పడతామని, అనుమానితులు కూడా విచారిస్తామని మలికా గార్గ్ తెలిపారు. కార్డెన్ సెర్చ్ నిర్వహించి క్షుణ్ణంగా పరిశీలిస్తామన్న మలికా గార్గ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకొని ప్రతి ఒక్కరు లా అండ్ ఆర్డర్స్ కు సహకరించాలని కోరారు. మాచర్లలోని ముందస్తు చర్యలో భాగంగా పట్టణంలోని అన్ని షాపులను పోలీసులు మూసి వేయించడం జరిగిందని ఆమె తెలిపారు.

లేడీ సింగం లా రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న మలికా గార్గ్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలగజేస్తున్న ప్రశ్న. మలికా ఓ పోలీస్ కుటుంబం నుంచే వచ్చారు. ఆమె తండ్రి కూడా ఐ.పి.ఎస్. అధికారి. ఆయన డి.జి.పి. గా కూడా పనిచేశారు. మలికా గార్గ్ తండ్రి డ్యూటీ పట్ల ఎంతటి అంకితభావంతో ఉంటారు అనడానికి ఒక ఉదాహరణను ఆమె చెప్పారు. అదేమిటంటే.. మలికా గార్గ్ పెళ్లికి కూడా తన తండ్రి డ్యూటీ చేశారట.

ఇక.. ఢిల్లీ ఐ.ఐ.టి నుంచి బి.టెక్ కంప్యూటర్స్ చేసిన మలికా గార్గ్.. తన కాలేజ్ లోని క్లాస్ మేట్.. ఆ తర్వాత ఐ.పి.ఎస్. లోని బ్యాచ్ మేట్ అయిన ఐ.పి.ఎస్. వకుల్ జిందాల్ ను వివాహమాడారు. తొలుత వెస్ట్ బెంగాల్ లో కొన్నేళ్లు పనిచేసిన మలికా గార్గ్.. ఆ తర్వాత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోనే వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు మలికా గార్గ్.

Related Posts