డిసెంబర్ లోనే నాని హాయ్ నాన్న

నేచురల్ స్టార్ నాని, మృణాళినీ ఠాకూర్ జంటగా నటిస్తోన్న సినిమా హాయ్ నాన్న. శౌర్యు అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఈ సినిమాపై నాని భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఖచ్చితంగా హిట్ కొడతాం అనే నమ్మకంతో ఉన్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా కాబట్టి నాని ఇమేజ్ కు తగ్గట్టుగా బలమైన కథనం కూడా ఉంటే అతను కోరుకున్న విజయం దక్కడం పెద్ద కష్టమేం కాదు.

ఇక ఖుషీ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం చేస్తోన్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా విడుదల చేసిన సమయమా అనే పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఈ హాయ్ నాన్న మూవీని ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా విడుదల చేయబోతున్నారు. అందుకోసం క్రిస్మస్ బరిలో నిలిచి డిసెంబర్ 22న విడుదల చేయాలనుకున్నారు. బట్ ఆ టైమ్ కు డైనోసార్ లాంటి సలార్ వచ్చి పడింది. ఇది కొన్ని రోజులు ఊహిస్తున్నదే. అయితే తాజాగా ఆ డేట్ నే ఖరారు చేశారు. దీంతో క్రిస్మస్ మూవీస్ అన్నీ కొత్త డేట్స చూసుకుంటున్నాయి. అలా హాయ్ నాన్న కూడా కొత్త డేట్ వెదుక్కుంది.


మామూలుగా కొత్త డేట్ అనగానే పోస్ట్ పోన్ అవుతుందనే అనుకుంటారు. బట్ హాయ్ నాన్నను ప్రీ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంటే డిసెంబర్ బరిలోనే ఉండాలనేది మేకర్స్ నిర్ణయం అంటున్నారు. ఈ మేరకు డిసెంబర్ 7న విడుదల చేయాలనుకుంటున్నారని టాక్. నిజానికి డిసెంబర్ 8న వరుణ్‌ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ తో పాటు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉన్నాయి.

ఈ రెండిటికంటే ఒకరోజు ముందే నాని సినిమా వస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం ఈ రెండు సినిమాలపై పడుతుంది. ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్, గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వీరి మధ్యకు నాని రావడం అంటే పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు ఉంటుందని సెటైర్స్ వేస్తున్నారు. అయితే నాని మూవీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Posts