‘కాంతార‘ కోసం రంగంలోకి హాలీవుడ్ టెక్నీషియన్స్

‘కె.జి.యఫ్‘ సిరీస్ తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న మరో కన్నడ చిత్రం ‘కాంతార‘. 2022లో విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ దగ్గర నుంచి ప్రతీ విషయమూ ఓ సంచలనం అయ్యింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే కథానాయకుడిగానూ నటించి అద్భుతమైన విజయాన్నందుకున్నాడు రిషబ్ శెట్టి. ముఖ్యంగా.. చివరి 20 నిమిషాలలో తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. అయితే.. ఆడియన్స్ ఇప్పటికే చూసింది ‘కాంతార 2’ మాత్రమే. ఇప్పుడు ‘కాంతార’కి ప్రీక్వెల్ ని తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి. ‘కాంతార.. ఎ లెజెండ్ చాప్టర్ 1’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది.

‘కాంతార‘ ఘన విజయాన్ని సాధించడంతో.. ఇప్పుడు ప్రీక్వెల్ ని అంతకు రెండు, మూడు రెట్లు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి. ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజులో తీసుకొచ్చేందుకు హాలీవుడ్ టెక్నీషియన్స్ ను ఆన్ బోర్డులోకి తీసుకున్నాడట. హాలీవుడ్ లో ‘ది క్రానికల్స్‌ ఆఫ్‌ నార్నియా, ది లయన్‌ కింగ్‌’ వంటి చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ సమకూర్చిన కంపెనీ.. ‘కాంతార‘ ప్రీక్వెల్ కి పనిచేయబోతుందట. ప్రస్తుతం కర్ణాటకలోని కుందాపుర ప్రాంతంలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ‘కాంతార‘ షూటింగ్ జరుపుకుంటోంది. మొదటి వెర్షన్ కి డివోషనల్ మ్యూజిక్ అందించిన అజనీష్ లోక్ నాథ్.. ప్రీక్వెల్ కి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో ‘కాంతార‘ ప్రీక్వెల్ ని నిర్మిస్తుంది.

Related Posts