ఆస్కార్ విజేతకు జన్మదిన శుభాకాంక్షలు

హిందీ ప్రేక్షకులకు అతను ఎమ్.ఎమ్.క్రీమ్. తమిళులకు మరకతమణి. మన తెలుగు వారికి ఎమ్.ఎమ్.కీరవాణి. వ్యాపారాత్మక సినిమాల్లోనూ సంగీత విలువలతో రాగాలు కట్టి మెప్పించగల దిట్ట కీరవాణి. ఈరోజు (జూలై 4) కీరవాణి పుట్టినరోజు.

మూడు దశాబ్దాలకు పైగా తెలుగు చిత్ర సీమలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ కీరవాణి. తొలినాళ్లలో రాజమణి, చక్రవర్తి వంటి సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసిన కీరవాణి.. 1990లో ‘మనసు మమత’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటినుండి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ కి సంగీత దర్శకత్వం వహించారు.

తొలి దశాబ్దంలో మంచి దూకుడు చూపించారు కీరవాణి. ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు ఈజీగా చేసేవారు. ఇక.. 2000 నుంచి ఈ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ స్పీడు తగ్గింది. ఏడాదికి కేవలం నాలుగైదు సినిమాలతో సరిపెట్టుకున్నారు. 2010 నుంచైతే.. కీరవాణి మరింత స్లో అయ్యారని చెప్పొచ్చు. తన తమ్ముడు రాజమౌళి, తను ఎంతగానో గౌరవించే రాఘవేంద్రరావు వంటి దర్శకుల సినిమాలు మాత్రమే ఎక్కువగా చేశారు.

90ల నుంచి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలకు కీరవాణి ఎక్కువ పనిచేశారు. వీరి కాంబినేషన్ లో ‘అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, పెళ్లి సందడి, అన్నమయ్య, శ్రీరామదాసు’ వంటి పలు మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. దాదాపు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 25 చిత్రాలకు కీరవాణి సంగీతాన్ని సమకూర్చడం విశేషం.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికీ కీరవాణియే సంగీత దర్శకుడు. జక్కన్నకు వరుసకు అన్నయ్య అయ్యే కీరవాణి.. రాజమౌళి చిత్రాల విజయంలో కీలక భూమిక పోషించారనడంలో అతిశయోక్తి లేదు. ‘బాహుబలి’ సిరీస్ వంటి మేగ్నమ్ ఓపస్ కు కీరవాణి అందించిన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.

‘బాహుబలి‘ సిరీస్ తర్వాత అన్నాదమ్ములు కీరవాణి-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్‘. ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పింది. ఈ సినిమాతో ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును అందుకున్నారు కీరవాణి.

ప్రస్తుతం మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దరితోనూ సినిమాలు చేస్తున్నారు కీరవాణి. పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు‘ చిత్రానికి సంగీతాన్నందిస్తున్న కీరవాణి.. చిరంజీవి ‘విశ్వంభర‘కి మ్యూజిక్ ఇస్తున్నారు. అలాగే.. రాజమౌళి-మహేష్ కాంబినేషన్ లో రూపొందే సినిమా కూడా కీరవాణి కిట్టీలోనే ఉన్న సంగతి తెలిసిందే. మొత్తంగా కీరవాణి అంటే తెలుగు సినిమా సంగీతానికి దొరికిన ఓ మరకతమణి. ఆ మణి పూసలు మరిన్ని మన సినిమాలకు అందించాలని కోరుకుంటూ కీరవాణికి బర్త్ డే విషెస్ తెలుపుతుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.

Related Posts