PRABHAS RAJAMOULI :- “ఆర్ఆర్ఆర్” డేట్స్ పై క‌న్నేసిన “రాధే శ్యామ్”

ఆర్ఆర్ఆర్… సినీ అభిమానులంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్న సినిమా ఇది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల కాంబినేష‌న్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ ఏ ముహుర్తాన మొద‌లుపెట్టారో కానీ… వాయిదా ప‌డుతూనే ఉంది. జ‌న‌వ‌రి 7న రావాల్సిన ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూసిన జ‌నాల‌కు రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి జ‌క్క‌న్న స‌ర్ ఫ్రైజ్ చేశారు. ఇలా రెండు రిలీజ్ డేట్స్ రిలీజ్ చేయ‌డం ఇదే మొద‌టిసారి. ఆ రెండు డేట్లు… మార్చి 18, ఏప్రిల్ 28.

ఇక ఆర్ఆర్ఆర్ వ‌లే… వాయిదా ప‌డిన మ‌రో పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రాధేశ్యామ్ మూవీ న్యూరిలీజ్ డేట్ ఎప్పుడ‌నేది అనౌన్స్ చేయ‌లేదు కానీ… ఆర్ఆర్ఆర్ డేట్స్ పై క‌న్నేసింద‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 18న రాక‌పోతే….రాధేశ్యామ్ చిత్రాన్ని మార్చి 18న థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఆర్ఆర్ఆర్ అదే తేదీకి రావాలని ఫిక్స్ అయితే మాత్రం.. రాధే శ్యామ్ సినిమాని ఏప్రిల్ 28ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట.

ప్రస్తుత పరిస్థితుల్లో రెండు పాన్ ఇండియా చిత్రాల మధ్య క్లాష్ మంచిది కాదనే ఉద్దేశ్యంతో ఆర్ఆర్ఆర్ కోసం రెండు రిలీజ్ డేట్స్ లాక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాల విడుదల తేదీలను దృష్టిలో పెట్టుకొని మిగతా చిత్రాల డేట్స్ ని ప్లాన్ చేసుకోనున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసిన సినిమాలు వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ మూవీకి ముందూ వెనుక రెండు వారాల పాటు మరో పెద్ద సినిమా రావడానికి సాహసించకపోవచ్చు. ఏది ఏమైనా క్లారిటీ రావాలంటే… కొన్ని రోజులు ఆగాల్సిందే.