‘ప్రేమలు’ తెలుగు ట్రైలర్ అదిరింది

ప్రేమకథా చిత్రాలకు బాషతో సంబంధం లేదు. కంటెంట్ కనెక్ట్ అయితే చాలు ఏ భాషా ప్రేమికులైనా ఆదరిస్తారు. ఇక.. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ‘ప్రేమసాగరం, ప్రేమదేశం, ప్రేమిస్తే’ వంటి అనువాద చిత్రాలు తెలుగులో అద్భుతమైన విజయాలు సాధించాయి. ఇప్పుడు అదే ప్రేమ టైటిల్ తో రాబోతుంది ‘ప్రేమలు’.

ఇప్పటికే మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ‘ప్రేమలు’ సినిమా అదే టైటిల్ తో మార్చి 8న తెలుగులో విడుదలవుతోంది. దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ‘ప్రేమలు’ తెలుగు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

ఈ సినిమా డబ్బింగ్ మూవీ అయినా.. ట్రైలర్ లో ఎక్కడా ఆ వాసనలు కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం ఈ చిత్రం బ్యాక్ డ్రాప్ హైదరాబాద్. అలాగే.. ఈ మూవీకి తెలుగు డైలాగ్స్ అందించింది #90s వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్. హైదరాబాద్ లో బాగా పాపులర్ అయిన కుమారి ఆంటీ రిఫరెన్స్ డైలాగ్స్, ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోని ‘తొక్కుకుంటూ పోవాలే’ డైలాగ్ ఈ ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక.. హైదరాబాద్ ఐ.టి. ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే ఈ స్టోరీ తెలుగు వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మలయాళంలో ఫహాద్ ఫాజిల్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి గిరీష్ ఎ.డి. దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నెల్సన్ కె.గఫూర్, మమిత బైజు లీడ్ రోల్స్ పోషించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘ప్రేమలు’ తెలుగు ప్రేక్షకుల్ని ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Posts