‘మహారాజ‘ రివ్యూ

నటీనటులు: విజయ్‌ సేతుపతి, అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌, నటరాజ్‌, భారతీరాజా, అభిరామి తదితరులు తదితరులు
సినిమాటోగ్రఫి: దినేశ్ పురుషోత్తమ‌న్‌
సంగీతం: అజనీశ్‌ లోకనాథ్‌
ఎడిటింగ్‌: ఫిల్లోమిన్‌ రాజ్‌
నిర్మాతలు: సుదర్శన్‌ సుందరమ్‌, జగదీశ్‌ పళనిస్వామి
దర్శకత్వం: నిథిలన్‌ స్వామినాథన్‌
విడుదల తేది: 14-06-2024

‘పిజ్జా‘ సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ సేతుపతి.. అదే చిత్రం అనువాదంతో తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు అనువాద సినిమాలతో తెలుగులో పాపులరైనా.. ‘ఉప్పెన‘ మాత్రం సేతుపతికి మెమరబుల్ మూవీగా నిలిచింది. తమిళనాట మక్కల సెల్వన్ గా పిలవబడే విజయ్ సేతుపతి 50 సినిమాల మైలురాయిని చేరుకున్నాడు. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా చేసిన ‘మహారాజ‘ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
మ‌హారాజగా టైటిల్ పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. అతనొక బార్బర్. భార్య ఓ యాక్సిడెంట్ లో మరణించడంతో.. కూతురు జ్యోతిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంటాడు. తన బిడ్డతో కలిసి ఊరికి దూరంగా ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. ఒకరోజు మహారాజ గాయాలతో పోలీస్ ష్టేషన్ కి వెళతాడు. ముగ్గురు ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి త‌న‌పై దాడి చేశార‌ని.. ఈ క్రమంలోనే త‌మ బిడ్డ ప్రాణాల్ని కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లిపోయార‌ని.. కంప్లైంట్ చేస్తాడు. అసలు లక్ష్మి ఎవరు? ఆ అగంతకులకు మహారాజతో ఉన్న విరోధం ఏంటి? అనేదే మిగతా కథ.

విశ్లేషణ
కొన్ని సినిమాలకు కథే ప్రాణమైతే. మరికొన్ని చిత్రాలకు కథనం మరింత ప్రాధాన్యం. ‘మహారాజ‘ సినిమా ఆద్యంతం కథనం ఆధారంగా సాగుతోంది. కథగా ఓ రొటీన్ కమర్షియల్ సినిమాలా అనిపించినా.. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు డైరెక్టర్ నిథిలన్‌ స్వామినాథన్‌. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే సన్నివేశాలుతో.. తర్వాత ఏం జరుగుతోంది? అనే క్యూరియాసిటీని ప్రేక్షకులకు కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడని చెప్పొచ్చు.

పాయింట్ గా చెప్పుకుంటే చాలా సింపుల్ స్టోరీ. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయానికే సరిపోయినట్టు అనిపిస్తుంది. అయినా.. ఆ పాత్రలను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటోంది. ఎక్కడా బోర్ లేకుండా సరదా సన్నివేశాలతో ఆ క్యారెక్టర్స్ ను తీర్చిదిద్దారు. అలా.. సరదా సన్నివేశాలతో మొదలై.. ఊహకు అందని ట్విస్టులతో సినిమాని ఎంతో భావోద్వేగపూరితంగా ముగించాడు డైరెక్టర్. ఇంటర్వెల్, క్లైమాక్స్ లలో వచ్చే ట్విస్ట్స్ బాగా ఆకట్టుకుంటాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
సహజమైన నటనకు కేరాఫ్ అడ్రస్ విజయ్ సేతుపతి. ఎంతో విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూనే.. ఆ పాత్రలకు వన్నె తెస్తుంటాడు సేతుపతి. ‘మహారాజ‘ చిత్రంలోని టైటిల్ రోల్ కూడా ఆ కోవకు చెందినదే. మహారాజ పాత్రలో ఎన్నో పార్శ్వాలున్నాయి. కొన్ని భావోద్వేగ సన్నివేశాలలో కళ్లతోనే
భావాలు పలికించాడు విజయ్ సేతుపతి. యాక్షన్ లోనూ అదరగొట్టాడు. విజయ్ సేతుపతి తర్వాత మెయిన్ విలన్ గా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అదరగొట్టాడు. ఎస్సై పాత్రలో నటరాజ్ ఆకట్టుకుంటాడు. ఇంకా.. మమతా మోహన్ దాస్, అభిరామి, భారతీరాజా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక నిపుణుల గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా ప్రశంసించాల్సింది దర్శకుడిని. అతను కథను నడిపిన విధానం మెప్పిస్తుంది. నేపథ్య సంగీతంలో ఎక్స్ పెర్ట్ అయిన అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో ప్లస్. సినిమా ఆద్యంతం సస్పెన్స్ ను క్యారీ చేయడంలో అజనీష్ లోక్ నాథ్ బి.జి.ఎమ్. కీలక పాత్ర పోషించింది.

చివరగా
మొత్తంమీద.. ‘మహారాజ‘గా విజయ్ సేతుపతి ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడం గ్యారంటీ

రేటింగ్:3/ 5

Related Posts